AP weaving labour in YSRCP Government: వెనకబడిన వర్గాలను ఉద్దరించడంలో దేశంలోనే మనల్ని కొట్టేవాడు లేడంటూ సీఎం జగన్ మాటలు చెబుతారు. అయితే.. అవన్నీ నిజాలే అనుకుంటున్నారా..? బలహీన వర్గాలను ఆయన చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తున్నారని భ్రమపడుతున్నారా..? అయితే జగన్ కనికట్టు తెలియాలంటే.. చేనేత కార్మికులను వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా మోసం చేస్తుందో ఒకసారి తెలుసుకోవాల్సిందే..
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టువస్త్రాలకు ప్రసిద్ధి. అక్కడ 33వేల మంది చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తుంటారు. నేతన్న నేస్తం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికులకు సాయం చేస్తోందని సీఎం జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఏడాది జులై 21న సీఎం జగన్ విడుదల చేసిన నేతన్న నేస్తం సాయం కేవలం 10వేల మందికి మాత్రమే అందింది. మిగిలిన 23 వేల మంది పరిస్థితి ఏంటంటే.. ప్రభుత్వం వివిధ రకాల నిబంధనలు, ఆంక్షలతో సాయానికి నోచుకోలేదు. వీరిలో 15 వేల మందికి సొంత మగ్గాలు లేవని.. వేరొకరి వద్ద కూలికి మగ్గాలు నేస్తున్నారని సాయం అందించమన్నారు. మిగిలిన 8వేల మంది చేనేత ఉప వృత్తులు చేసుకుంటున్నారని అసలు లెక్కలోకే తీసుకోలేదు. ఇది ఇప్పుడు కొత్తేమీ కాదు. గత ఐదు విడతల సాయంలోనూ జగన్ ప్రభుత్వం ఇదే పంథా అనుసరించింది.
AP Weavers Problems: నాడు దోస్తీ.. నేడు కనీసం పట్టించుకోని పరిస్థితి
AP Weavers Problems: ఇది కేవలం ఒక్క ధర్మవరానికే పరిమితం కాదు.. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఉన్న ప్రతిచోట ఇలాంటి పరిస్థితే ఉంది. చేనేత, అనుబంధ రంగాల వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది ఉండగా.. ఇటీవల నేతన్న నేస్తం అందించింది మాత్రం కేవలం 80వేల మందికి మాత్రమే. అదేమని ప్రశ్నిస్తే.. తాము ఎన్నికల మేనిఫెస్టోలో మగ్గం ఉన్నవారికే ప్రోత్సాహం ఇస్తామని చెప్పామంటున్నారు. అంటే మగ్గం లేకుండా ఇతరుల వద్ద కూలికి నేత పనిచేసే వారు చేనేత కార్మికులు కారా..? వారికి సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? తాము పేదల పక్షపాతమని పదేపదే చెప్పుకుంటున్న జగన్‌కు.. కూలికి నేత పనిచేసే కార్మికులు పేదలుగా కనిపించడం లేదా..? రోజువారీ వేతనం కింద పనిచేస్తూ చేనేతకు అనుబంధంగా ఉప వృత్తులు చేసుకునేవారు ధనవంతులని అనుకుంటున్నారా.? నాలుగేళ్లుగా సాయం కోసం వారు గగ్గోలు పెడుతున్నా.. అవి సీఎం జగన్ చెవికెక్కడం లేదు. సాయం అవసరం ఉన్నవారికి చేయకుండానే మగ్గానికి మహర్దశ తెచ్చాం అంటూ..పూలే, అంబేడ్కర్ వంటి మహనీయులు పేర్లు చెప్పి డాంబికాలు పలకడమెందుకని నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.