spandana Complainants fired on AP officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘స్పందన’ కార్యక్రమంపై ఫిర్యాదుదారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించగా.. మొదట్లో ఈ కార్యక్రమం చురుగ్గా కనిపించినప్పటికీ రానూరానూ విమర్శలకు గురవుతోంది. ప్రతి సోమవారం రోజున జరిగే ఈ 'స్పందన' కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదులిచ్చినా అధికారుల నుంచి ఎటువంటి స్పందనలేదని అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాళ్లరిగిపోయేలా కలెక్టర్‌ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆఫీసర్లు ఏమాత్రం కనికరం చూపటంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు.
'స్పందన'కు అధికారుల స్పందన కరవు.. 'పదులసార్లు ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు స్పందించటంలేదు.. మా భూమిని కబ్జాదారుల నుంచి అధికారులు కాపాడి, ఇప్పించాలంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఏమాత్రం కనికరం చూపటంలేదు.. మా ఇంటి స్థలాన్ని అక్రమంగా మరొకరు ఆక్రమించారని, ఇప్పటికీ 40 సార్లు స్పందనకు వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా కిందిస్థాయి అధికారుల నుంచి కనీసం స్పందన కూడా లేదు.' అంటూ అనంతపురం జిల్లాకు చెందిన బాధితులు ఆవేదన చెందుతున్నారు. సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందనకి వస్తున్న బాధితులను కదిలించగా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు కనికరం చూపటం లేదు.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం చేపట్టిన స్పందన కార్యక్రమానికి వస్తున్న బాధితుల పట్ల అధికారులు శ్రద్ధ చూపటంలేదు. కాళ్లరిగిపోయేలా అర్జీదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న అధికారులు కనికరం చూపటంలేదు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే వారి ఎదుటనే సమస్యను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు పై అధికారులు ఆదేశాలిచ్చినా అవి అమలుకాని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ మొదలుకొని వివిధ శాఖల అధికారులు కొలువుదీరి నిర్వహించే స్పందన కార్యక్రమంపై విమర్శలు తలెత్తుతున్నాయి.