ఇంటర్మీడియట్‌లో ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ఇంటర్ విద్యా మండలి ఆగస్టు 10న జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2021-22) ప్రవేశాలకు పాత విధానాన్నే అనుసరించాలని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఇంటర్ ప్రవేశాల వ్యవహారమై భాగస్వాములకు పాత్ర కల్పించి, రాష్ట్ర ప్రభుత్వం చట్టం/నిబంధనలను రూపొందించుకునేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఆన్‌లైన్ ప్రవేశాల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఇంటర్ విద్యా మండలికి బదలాయించడం.. చట్టప్రకారం చెల్లదన్నారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రత నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొనలేదన్నారు. తర్వాత ఆ విషయాన్ని చెబుతున్నారని ఆక్షేపించారు.
ఇంటర్ విద్యామండలి ఇచ్చిన నోటిఫికేషన్‌కు చట్టబద్ధత లేదన్నారు. కొవిడ్ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనప్పుడు ప్రతిభ ఆధారంగా ఇంటర్ ప్రవేశాలు నిర్వహిస్తామని చెప్పడం అర్థం లేని విషయమని కొట్టిపారేశారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నారని ఇంటర్ విద్యామండలి చెబుతున్నప్పటికీ ఆ కారణంతో నిబంధనలకు అనుగుణంగా లేని ప్రకటనను సమర్థించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Inter online admissions: ప్రస్తుత విద్యా సంవత్సరానికి పాత విధానమే: హైకోర్టు - ap news
14:39 September 06
ఆన్‌లైన్ ప్రవేశాలు రద్దు
కొవిడ్‌ను సాకుగా చూపుతున్నారు..
ఆన్‌లైన్ ప్రవేశాల నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణరెడ్డి, కొందరు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, వేదుల వెంకటరమణ, న్యాయవాది నల్లూరి మాధవరావు, తదితరులు వాదనలు వినిపించారు. ‘ఆన్‌లైన్ ప్రవేశాలకు విధివిధానాలు రూపొందించలేదు. పత్రికా ప్రకటన ద్వారా ఇంటర్‌బోర్డు ఆన్‌లైన్ విధానాన్ని వెల్లడించింది. గతేడాది ఇలాగే చేస్తే హైకోర్టు తప్పుపట్టింది. విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు చెబుతోంది. అలాంటప్పుడు ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు? ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించడం కోసం కొవిడ్‌ను ఓ సాకుగా చూపుతున్నారు. విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంచుకునే హక్కును హరిస్తున్నారు. ఆన్‌లైన్ ప్రవేశాల ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయండి’ అని కోరారు. ఇంటర్మీడియట్ బోర్డు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రవేశాల కోసం తల్లిదండ్రులు కళాశాలల చుట్టూ తిరిగి ఇబ్బందిపడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరారు. వాదనలు ముగియడంతో ఇటీవల తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి.. సోమవారం నిర్ణయాన్ని వెల్లడించారు.
ఇదీ చదవండి