చేనేత వస్త్రాల మన్నిక, నాణ్యతే వేరు... కానీ... మరమగ్గాలపై తయారైన వస్త్రాలు, పట్టుచీరలు మార్కెట్లో చౌకగా లభిస్తాయి. చేనేత అని చెబుతూ మరమగ్గాల చీరలను తక్కువ రేట్లతో అమ్ముతున్నారు. ఈ పరిస్థితి నేతన్న ఉపాధికి గండి కొడుతోంది. మార్కెట్లో ఏది చేనేతో, ఏది మరమగ్గం వస్త్రమో నిపుణులే గుర్తించలేనంతగా తయారవుతున్నాయి. ఈ విషయంపై చేనేత సహకార సంఘాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. పరిష్కారంగా... చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెట్‌లో చోటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ కామర్స్ సంస్థలు... అమెజాన్, ఫ్లిప్‌క్లార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో చేనేత వస్త్రాలు విక్రయించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆప్కో సంస్థ ద్వారా చేనేత వస్త్రాలు సేకరించాలని చేనేత, జౌళి శాఖ నిర్ణయించింది. కంప్యూటర్ డిజైనింగ్ కూడా అందుబాటులోకి వచ్చినందున.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చేనేత కార్మికులు సిద్ధమవుతున్నారు. తమ డిజైన్లు ఆన్‌లైన్ ద్వారా ప్రపంచానికి తెలిసే అవకాశం కలగడమే కాక.. అమ్మకాలు పెరుగుతాయని నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలుత 25రకాల వస్త్రాలను ఆన్‌లైన్ ద్వారా విక్రయించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.