2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరా రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన స్వగ్రామమైన అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో వ్యవసాయం చేస్తూ.. దేవాలయాల నిర్మాణాలు చేపట్టారు. ఆధ్యాత్మికత విశిష్టతను తెలిపేలా దేవాలయాలు రూపుదిద్దుకుంటున్నాయి. భవిష్యత్తులో దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మికత కేంద్రంగా చెప్పుకునే విధంగా తన గ్రామంలో దేవాలయ నిర్మాణాలు చేపడుతున్నానన్నారు.
స్థానికులు వద్ద పది రూపాయల విరాళంతో ఇటుకను సేకరించి దేవాలయ నిర్మాణ పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. మొదటినుంచి నిర్మాణ పనులు రఘువీర దగ్గరుండి పరిశీలిస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. వచ్చే జూన్ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ తొమ్మిది రోజులపాటు ప్రారంభ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రారంభానికి పలు మఠ పీఠాధిపతులను ఆహ్వానించారు.
పంటలు బాగా పండి, ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే దేవుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలని మాజీ సర్పంచ్, రఘువీర సన్నిహితుడు జి. ప్రభాకర్ రెడ్డి అన్నారు. అందుకే రఘువీరా రెడ్డి నీలకంఠపురం గ్రామంలో ఆగమశాస్త్రం ప్రకారం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం ఏర్పాటు చేసి ప్రజలను ఆధ్యాత్మికంలో నిమగ్నం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రారంభం అనంతరం ఇతర ప్రాంతాల నుంచి ఆధ్యాత్మిక గురువులతో ప్రతిరోజు హోమాలు, బోధనలు జరగనున్నాయని తెలిపారు.
12 పుణ్యక్షేత్రాల, 19 పుణ్యనదుల మట్టి, తీర్థం, నదీ జలాలతో శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. ఈ దేవాలయాన్ని ప్రాచీన దేవాలయ శైలిలో నిర్మాణం చేపట్టారు. వీటితో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి, 162 మూల స్తంభాలు, పుష్కరిణి యాగశాల భక్తులను ఆకట్టుకుంటాయి. భవిష్యత్తులో నీలకంఠాపురం గ్రామం ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా చరిత్రలో నిలబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు