అనంతపురం జిల్లా కదిరిలో మూడేళ్ల కుమార్తెను అట్లకాడతో కాల్చి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో మరో కోణం వెలుగుచూసింది. కదిరి పట్టణం కందికుంట నారాయణమ్మ కాలనీలో నివాసం ఉంటున్న రామాంజినమ్మ అనే మహిళ భర్త నుంచి విడిపోయి మరో వ్యక్తితో కలిసి కాపురం ఉంటోంది. అమీన్నగర్కు చెందిన మరో మహిళ సహకారంతో నెలన్నర వయస్సు ఉన్న తన రెండో కుమార్తెను రూ. 50వేలకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
రామాంజినమ్మ మొదటి కుమార్తె పది రోజుల కిందట... తల్లి రెండో పెళ్లి ప్రస్తావనతో పాటు తన చెల్లి ఎక్కడుందని అడిగింది. ఆగ్రహించిన రామాంజినమ్మ కుమార్తె ఒంటిపై వాతలు పెట్టి గాయపరిచింది. ఛైల్డ్ లైన్, ఐసీడీఎస్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తులో భాగంగా రామాంజినమ్మ రెండో కుమార్తె విక్రయం విషయం వెలుగుచూసింది. చిన్నారిని అనంతపురం వాసులకు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అర్బన్ సీఐ రామకృష్ణ తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.