అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో.. వెంకటేష్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో తాను పనిచేసిన చోట శునకాలు ఆకలితో ఉండటం చూసి చలించిపోయారు. ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారంలో సగ భాగం శునకాలకే పెట్టేవారు. అప్పటి నుంచి మొదలైన శునక సేవ.. 22 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది.
శునకాల కోసం వెంకటేష్ తన ఇంట్లోని ఓ గదిని పూర్తిస్థాయి వంటశాలగా మార్చేశారు. భార్య జయమ్మ, మరో సహాయకుడి ద్వారా రోజూ 350 శునకాలకు బిర్యానీతోపాటు పరమాన్నం వండుతున్నారు. వంట పూర్తి కాగానే కవర్లలో నింపుకొని... దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లి వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నారు. వెంకటేష్ వాహన శబ్ధం వినగానే కుక్కలు వాహనాన్ని చుట్టుముడతాయి. శునకాల కడుపు నింపటానికి జయమ్మ, వెంకటేష్ జంట నెలకు 30 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
శునకాల ఆకలి తీర్చటమే కాదు.. వాటి బాగోగులూ వెంకటేష్ చూసుకుంటున్నారు. అనారోగ్యం బారినపడిన వాటిని పశువైద్యుడికి చూపించి అవసరమైన మందులు కొనుగోలు చేస్తూ సంరక్షిస్తున్నారు. వీధి కుక్కల క్షుద్బాధ తీరుస్తున్న కానిస్టేబుల్ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి. - త్యాగరాజు, విశ్రాంత ఏఎస్సై