అతను వేసే ఈల మూగజీవాల ఆకలి తీరుస్తుంది.. 22 ఏళ్లుగా పశుపక్ష్యాదుల ఆకలి తీరుస్తున్న ఇతని పేరు అర్జున్ సింగ్. 30 ఏళ్ల క్రితం అనంతపురంలో స్థిరపడ్డారు. మెటల్ వర్క్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా తాను ఇబ్బంది పడుతున్న రోజుల నుంచే.. ఉన్నదాంట్లో కొంత మూగజీవుల ఆకలి తీర్చేందుకు వెచ్చించేవారు. తన సంపాదన పెరిగే కొద్దీ వాటికి పెట్టే ఖర్చునూ పెంచుతూ వస్తున్నారు.
రోజూ ఉదయాన్నే మార్కెట్‌కు వెళ్లి క్రేట్ అరటిపళ్లు సహా సీజనల్‌గా లభించే వివిధ ఫలాలు కొనుగోలు చేసి.. ఇంట్లో భార్య తయారు చేసే ఆహారం పట్టుకుని 12 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. దారిపొడవునా మూగజీవుల ఆకలి తీర్చడమే కాక.. పేదలు, పిల్లలు, వృద్ధులు ఇలా ఎవరు అడిగినా దానం చేస్తుంటారు. ఆలయాల అనుబంధ గోశాలల్లో గోవులకు పశుగ్రాసం అందిస్తారు. అపారమైన దైవభక్తి ఉన్న అర్జున్‌సింగ్.. ఆలయాల్లో నైవేద్యానికి ఫలాలు సమర్పిస్తారు. బుక్కరాయసముద్రంలో పురాతన ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో రూ. 2.5 లక్షలతో షెడ్డు నిర్మించారు.