YSRCP govt stopped the work of Mega Bindusedyam scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం.. ప్రజలకు, రైతులకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి, వాటికి నిధులను కేటాయించి.. పనులను ప్రారంభించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు, రైతులు ప్రాజెక్టులు పూర్తయితే.. తమ కష్టాలు తీరుతాయని ఎన్నో కలలు కన్నారు. ఇంతలోనే ప్రభుత్వం మారింది.. ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది.. రైతుల కల చెదిరింది. గత నాలుగేళ్లుగా ఆగిపోయిన ప్రాజెక్టుల పనులు జరగక, నిధులు విడుదల కాక.. ఆ ప్రాంతాల ప్రజలు ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు. దీంతో ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఉరవకొండ ప్రాంత రైతులు సామూహిక మెగా బిందుసేద్యం పథకం పనులు ఆగిపోవడంతో వాపోతున్నారు.
రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సామూహికబిందుసేద్యం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. కరవు సీమలోని అనంతపురం జిల్లా ప్రజల సాగు నీటి కష్టాలను తీర్చేందుకు ఉద్దేశించిన ఈ పథకం.. మూలన పడింది. 50 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అటకెక్కించింది. కారణం ఏంటో తెలుసా.. ప్రాజెక్టును గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించడమే. అదే కారణంతో నేటి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పనులను గాలికొదిలేసిందని రైతులు చెబుతున్నారు.
మూలన పడిన మెగా బిందుసేద్యం ప్రాజెక్ట్..రాయలసీమలోని అత్యంత కరవు ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు ఇక్కడ తాండవిస్తుంటాయి. అలాంటి జిల్లాలో పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో గత తెలుగుదేశం ప్రభుత్వం.. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో సామూహిక మెగా బిందుసేద్యం పథకాన్ని తెచ్చింది. సుమారు 50 వేల ఎకరాలకు నీరిందించే ప్రయత్నంతో.. దీన్ని రూపొందించారు. అప్పట్లో 842 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2017 డిసెంబర్‌లో పనులు ప్రారంభించారు. 2019కి దాదాపు 70 శాతానికి పైగానే పనులు పూర్తయ్యాయి. ఈలోపు ప్రభుత్వం మారింది. ఇంకేముంది పనులు ఆగిపోయాయి. పథకం మూలన పడింది. ప్రస్తుతం పథకం కోసం పంప్‌హౌస్‌లు, అమిద్యాలలో నిల్వచేసిన సామగ్రి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. ఎక్కడ చూసినా మందుసీసాలు కనిపిస్తున్నాయి. సామగ్రి కొంతమేర పాడైపోగా.. మిగిలిన దాన్ని కొందరు ఎత్తుకెళ్లారు.
పరిహారం అందలేదు-ప్రాజెక్ట్ పనులు జరగలేదు.. జీడిపల్లి, పీఏబీఆర్, ఎంపీఆర్, జలాశయాల ద్వారాహంద్రీనీవా కృష్ణాజలాలను ఎత్తిపోసి, బిందుసేద్యం ద్వారా 50 వేల ఎకరాలకు నీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. మిడ్ పెన్నార్ జలాశయం, పెన్నా అహోబిళం రిజర్వాయర్‍ల ఎడమ కాలువల నుంచి.. ఉరవకొండ మండలంలో 25 వేల 714 ఎకరాలకు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. పీఏబీఆర్ ద్వారా కూడేరు మండలంలో 12,185 ఎకరాలకు, జీడిపల్లి జలాశయం నుంచి బెలుగుప్ప మండలంలో 12వేల 605 ఎకరాలకు కూడా నీరందాల్సి ఉంది. ఈ బృహత్తర ప్రాజక్టు పనులు నాలుగేళ్ల క్రితం నిలిచిపోవటంతో పంప్‌హౌస్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పరిహారం రాకపోగా, డ్రిప్ పథకంతో ఫలితం దక్కాల్సిన అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి.
డ్రిప్ వచ్చుంటే 3 పంటలు పండించుకునే వాళ్లం.. నాలుగేళ్లైనా నాలుగు రకాలుగా రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకంలో రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా అక్కడే ప్రాసెసింగ్ చేసే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని ప్రణాళిక చేశారు. స్థానికంగానే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులతో పాటు, వారి కుటుంబ సభ్యులకు అక్కడే ఉపాధి కల్పించాలని భావించారు. డ్రిప్ అందుబాటులోకి వచ్చుంటే తాము 3 పంటలు పండించుకునే వాళ్లమని.. కానీ, నాలుగేళ్లుగా ఒక్క అడుగూ ముందుకు పడలేదని ఈ ప్రాంతంలోని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం మారింది.. బిందుసేద్యం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది: రైతులు