AP Chief Minister Jagan Narpala tour: ''పేదల జీవితాల్లో పెను మార్పులను తీసుకొచ్చే చదువుకు.. రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందుకే 'జగనన్న విద్యా దీవెన'తో పాటు 'వసతి దీవెన' అనే పథకాలను తెచ్చాం. ఈ పథకం కింద 9 లక్షల 55వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 913 కోట్లు జమ చేస్తున్నాం. పేద పిల్లలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఈ ప్రోత్సాహంతో గత నాలుగేళ్లలో ఉన్నత విద్యను అభ్యసించేవారి సంఖ్య రెట్టింపు అయ్యింది. భవిష్యత్‌లోనూ విద్యార్థుల చదువుకు పెద్దపీట వేస్తాం. నాడు-నేడుతో తరగతి గదులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నాం. డిజిటల్ బోధన, పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ సహా వివిధ రకాల కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నాం'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఆ పథకం సరిపోవటంలేదని-ఈ పథకాన్ని తీసుకొచ్చాం.. అనంతపురం జిల్లా నార్పలలో నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి 'జగనన్న వసతి దీవెన' పథకం కింద రూ.912 కోట్లను బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. చదువు పేదరికం సంకెళ్లను తెంచుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చదువు ప్రాధాన్యతను గుర్తించి మొదటగా 'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని తీసుకొచ్చామన్న ఆయన.. ఆ పథకం సరిపోవటంలేదని 'జగనన్న వసతి దీవెన'ను ప్రవేశపెట్టమన్నారు. ఈ వసతి దీవెన ద్వారా నేడు దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను విద్యార్థులకు అందేలా చేశామన్నారు.
చంద్రబాబును విమర్శించటమే లక్ష్యంగా...అయితే, అనంతపురం జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి 'జగనన్న వసతి దీవెన' కింద లబ్దిచేకూర్చే సభ ఎన్నికల సభను తలపించింది. ప్రభుత్వ పథకాల గురించి, వాటి ద్వారా ప్రయోజనం గురించి, రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పాల్సిన ప్రభుత్వ సభ.. రాజకీయ రంగును పులుముకొని ప్రతిపక్ష పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించటమే లక్ష్యంగా సాగింది. సభలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ రావాలంటూ, దేవుడు పుట్టిన గడియల్లో పుట్టిన జగనన్న అంటూ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా విద్యార్థులతో నృత్యాలు చేయించారు.