బూదిలి సమీపంలో చిత్రావతి నదిలో ప్రాచీన గుడి, గుండ్లపై రాతిచిత్రాలు, శిల్పకళ గుర్తించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం శిలాశాసనాల అన్వేషణ చేశామని.. ఈ క్రమంలో వీటిని గుర్తించామని ఆయన వివరించారు. ఇక్కడ పెద్దపెద్ద రాళ్లపై అనంతశయన భంగిమలోని విష్ణుమూర్తి ప్రతిమ వెలుగు చూసిందని తెలిపారు.
ఇది.. వెయ్యేళ్ల నాటి ఆలయమై ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నదిలో చాలావరకు ఆలయం ఇసుకలో కూరుకుపోయిందని ఇది ఎనిమిది లేదా తొమ్మిదో శతాబ్దానికి చెందినదై ఉంటుందని అంచనా వేశారు. హేమావతి రాజధానిగా పాలన సాగించిన నోలంబుల కాలంలో బూదిలి ముఖ్య కేంద్రంగా విరాజిల్లిందని, అందుకే ఈ పరిసరాల్లో ఎక్కువగా ఆలయాలు ఉన్నాయని మైనాస్వామి పేర్కొన్నారు.