అనంతపురం జిల్లా కలెక్టరేట్లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శాఖల వారీగా మంత్రి బొత్స అభివృద్ధికి సంబంధించిన అంశాలను సమీక్షించారు. ఎమ్మెల్యేలు పలు శాఖల్లో ఎదురవుతున్న సమస్యలు, లోపాలపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు కలెక్టర్ గంధం చంద్రుడు మీడియాను సమావేశానికి అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు మీడియా ప్రతినిధులను ఆందోళన విరమించి వెళ్ళిపోవాలని సూచించారు. తాము ఆందోళనకారులు కాదని ఎందుకు పంపాలని చూస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం అక్కడినుంచి పోలీసులు వెనుదిరిగారు. దాదాపు రెండు గంటలపాటు నిరసన కొనసాగింది.
ప్రజలకు సేవలందించే ప్రభుత్వ శాఖల అధికారుల నిర్లక్ష్యాన్ని అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పుబట్టారు. ప్రజా సమస్యలపై ఫోన్లు చేస్తే జిల్లా అధికారులు చాలామంది ఫోను తీసి సమాధానం చెప్పే పరిస్థితిలేదని ఎమ్మెల్యేలు మంత్రి బొత్స సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యుత్ శాఖ 2017 నుంచి విద్యుత్ నియంత్రికలు అమర్చటంలేదని, 65 వేల నియంత్రికలు ఎప్పుడూ అమర్చుతారో చెప్పాలని ఎమ్మెల్యేలు ఎస్ఈని నిలదీశారు. వివిధ శాఖల అధికారులు తాము చేసిన అభివృద్ధిపై నివేదిక చదువుతుండగానే పలువురు ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. ఈసారి పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ, ఏ చెరువులకు ఎంత నీరిచ్చారో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.