మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందిస్తున్న బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి రోగులతో మాట్లాడించి జిల్లా అంతటా కరోనా రోగులు సంతృప్తిగా ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనానికి అధికారులు చూపించారు. అధికారులు చెప్పిన విషయాలన్నీ.. కొట్టిపారేస్తూ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వాస్తవాలన్నీ ఆళ్లనానికి వివరించారు. కరోనా రోగులున్న గదుల్లోకి వైద్యులు అడుగేపెట్టటంలేదని, రోగులకు అందిస్తున్న ఆహారం ఏమాత్రం బాగోలేదని చెప్పేశారు.
అనంతపురం జిల్లాలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై పలువురు ఎమ్మెల్యేలు ఆళ్లనాని దృష్టికి తీసుకొచ్చారు. ఆళ్లనాని కరోనా రోగులతో జూమ్ యాప్ ద్వారా వీక్షణ సమావేశం నిర్వహించారు. ఇందుకోసం ఉత్తమ సేవలు అందిస్తున్న ఆర్టీటీ ఆసుపత్రి రోగులను, మరో ప్రైవేట్ ఆసుపత్రి రోగులను వీక్షణ సమావేశంలో కూర్చోబెట్టి చికిత్సలు బాగా చేస్తున్నారని, మంచి ఆహారం అందిస్తున్నారంటూ చెప్పించారు. ఈ రెండు ఆసుపత్రుల రోగులను ఆళ్లనానికి చూపించి.. తాము చాలా బాగా పని చేస్తున్నామంటూ.. మంత్రికి చెప్పుకొచ్చారు.
అక్కడే ఉండి ఇవన్నీ గమనిస్తున్న అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి జిల్లాలో ఏమాత్రం పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని, దీనివల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. బోధనాసుపత్రిలో ప్రతి వార్డును సందర్శించి 490 మంది కరోనా రోగులతో నేరుగా మాట్లాడానని అనంత వెంకటరామిరెడ్డి వైద్యారోగ్యశాఖ మంత్రికి చెప్పారు. వైద్యులు వార్డులోకి అసలు అడుగుపెట్టటంలేదని, నర్సులు ఒక్కసారి మాత్రం వచ్చి మందులిచ్చి మళ్లీ అటువైపు కూడా కన్నెత్తి చూడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు కరోనా రోగుల పట్ల కనీసం మానవత్వంతో కూడా వ్యవహరించటంలేదని అనంత ఎమ్మెల్యే అన్నారు.
కరోనా రోగుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేస్తోందని ఆళ్లనాని చెప్పారు. కరోనా రోగులకు పౌష్టికాహారం కోసం ఒక్కో రోగికి ప్రభుత్వం రోజుకు ఐదు వందల రూపాయలు ఇస్తోందని తెలిపారు. భోజనం నాణ్యతగా అందించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడిని ఆదేశించారు. విధులపట్ల నిర్లక్ష్యం చేస్తున్న వైద్యల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎమ్మెల్యేల సూచనలపై నాలుగు రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆళ్లనాని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో వైద్యం అందక చెట్లకిందనే రోగులు చనిపోతున్న సంఘటనల గురించి మీడియా అడుగుతుండగానే, సమాధానం దాటవేస్తూ ఆళ్ల నాని వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:పబ్జీ ఆడిన తరువాత గుండె ఆగిపోయింది!