ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ప్రభావం... అనంత జేఎన్​టీయూ విద్యార్థులకు గడ్డుకాలం - jntu students facing problems news

బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది ప్రతి విద్యార్థి లక్ష్యం. ఇందుకు మార్చి నుంచి జూన్‌ వరకు ఉన్న సమయం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో కళాశాల విద్య పూర్తైన విద్యార్థులు...ప్రాంగణ నియామకాలతో పాటు ఇతర ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమవుతారు. కరోనా పుణ్యమా అని... ఈ సారి అనంతపురం జేఎన్​టీయూ విద్యార్థులకూ ఇబ్బందులు తప్పడం లేదు. నియామకాలు నిలిచి వందల మంది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు

ananthapuram jntu
కరోనా ప్రభావం... అనంత జేఎన్​టీయూ విద్యార్థులకు గడ్డుకాలం

By

Published : Jun 30, 2020, 4:49 AM IST

కరోనా ప్రభావం... అనంత జేఎన్​టీయూ విద్యార్థులకు గడ్డుకాలం

కరోనా మహమ్మారి ఏ వ్యవస్థనూ వదిలిపెట్టలేదు. వైరస్‌ వ్యాప్తితో పాఠశాలలు, కళాశాలలు మూసివేయడంతో..విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏటా ఈ సమయానికి ప్రాంగణ నియమకాలతో హడావిడిగా ఉండే అనంతపురం జేఎన్​టీయూ కళాశాలల విద్యార్థులకు దిక్కుతోచడం లేదు. జేఎన్​టీయూ పరిధిలో ఐదు జిల్లాలు ఉండగా, ఆయా జిల్లాల్లోని 140 ఇంజినీరింగ్, ఎంబీఏ ఫార్మసీ కళాశాలల్లో జనవరి నుంచే ప్రాంగణ నియామక ప్రక్రియ మొదలవుతుంది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 25 వేలమంది విద్యార్థులు ఉంటారు. వీరిలో కనీసం 12 నుంచి 13 వేల మంది వరకు ఏటా ఉద్యోగ నియామక పత్రాలు అందుకొంటారు. ఈసారి ఇంజినీరింగ్‌ ఇతర వృత్తివిద్యా కళాశాలల్లో ఆ సందడే కనిపించని పరిస్థితి ఏర్పడింది.

ప్రణాళిక తారుమారు...

కంపెనీల అవసరాలకు తగినట్లుగా విద్యార్థుల్లో చురుకుదనం కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేయాలని జేఎన్​టీయూ ప్లేస్‌మెంట్, ట్రైనింగ్‌ విభాగాల శిక్షకులు సిద్ధమయ్యారు. అయితే కరోనా మహమ్మారి విజృంభించటంతో ప్రణాళికంతా తారుమారైంది. విద్యార్థులందరినీ ఇళ్లకు పంపించాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటివద్ద ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లోని చాలా మంది విద్యార్థులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావడంతో... ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు కొనలేని పరిస్థితి ఉంది. మరికొందరి విద్యార్థులకు అవి ఉన్నప్పటికీ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవటం, దానికోసం పెద్ద ఎత్తున నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సి రావటం కూడా సమస్యగా మారింది. ఇలాంటి కారణాలతో అనేక మంది విద్యార్థులు క్లాసులకు హాజరుకాలేని పరిస్థితి నెలకొందని శిక్షకులు చెబుతున్నారు.

ఎంపిక పరీక్షకు తగ్గిన సంఖ్య...

ఉద్యోగ ఎంపిక పరీక్షకు ఒక్క జేఎన్టీయూ కళాశాలలోనే ఏటా నాలుగు వందలకు పైగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకునేవారు. ఈసారి ఆ సంఖ్య 230 మాత్రమే పరిమితమైందని ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. అయితే ఆన్‌లైన్‌లో ఆయా సంస్థల సమాచారాన్ని నిత్యం గమనించాలని, దరఖాస్తు చేసుకోవాలని జేఎన్​టీయూ వీసీ డాక్టర్‌ శ్రీనివాస్‌కుమార్‌ సూచిస్తున్నారు.

జేఎన్​టీయూ భరోసా...

విపణిలో ఉద్యోగ అవకాశాలకు కొదవలేదని చెబుతున్న అధ్యాపకులు... విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా అందుకు తగిన శిక్షణను ఆన్‌లైన్‌ ద్వారా పొందాలని సూచిస్తున్నారు. అందుకు కావాల్సిన ఎలాంటి సమాచారాన్ని అయినా జేఎన్​టీయూ నుంచి పొందవచ్చని భరోసా ఇస్తున్నారు.

ఇవీ చూడండి-ఫిట్​నెస్​ మంత్ర: సైక్లింగ్​తో వ్యాయామం.. ఆరోగ్యం భద్రం

ABOUT THE AUTHOR

...view details