Ananthapuram Government Medical College: వారంతా వైద్య విద్యపై మక్కువతో కష్టపడి చదివారు.. సీనియర్ల సూచనలు, ఆచార్యుల మార్గదర్శకంతో ఉత్తమ మార్కులు సాధించారు. అన్నింటా ప్రతిభ చాటి బంగారు పతకాలకు ఎంపికయ్యారు.. తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు.. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.. ప్రభుత్వ వైద్య కళాశాల 2016 బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకున్నారు. మంగళవారం 17వ స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. వంద మంది డిగ్రీ పట్టా పొందనున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో ప్రతిభ చాటిన తుది సంవత్సరం వైద్య విద్యార్థుల గురించి వారి మాటల్లోనే..
ఎన్‌ఎస్‌ఎస్‌లో ముందడుగు:జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్)లో చురుగ్గా పాల్గొన్నా. డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం బెస్ట్ ఫిమేల్ వాలంటీరు అవార్డును 2020-21 సంవత్సరానికి, 2019-20 ఏడాదికి ప్రభుత్వ వైద్య కళాశాల ఉత్తమ మహిళా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీరుగా అవార్డు సాధించా. హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంట్‌నీరింగ్ అండ్ వాటర్ స్పోర్ట్స్‌లో జాతీయ సాహస శిబిరంలో 2018లోనూ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నా. అక్కడి ప్రజల స్థితిగతులను తెలుసుకోగలిగా.- వరలక్ష్మి
ఆచార్యుల మార్గదర్శకం:ఆచార్యుల మార్గదర్శకంతోనే బంగారు పతకాలను సాధించా. కోర్సు పూర్తయ్యేలోగా 4 బంగారు పతకాలు దక్కాయి. మొదటి సంవత్సరంలో అనాటమీ, రెండో ఏడాదిలో డిటెన్షన్, మూడో సంవత్సరం డిటెన్షన్‌తోపాటు ఈఎన్‌టీ విభాగం, నాలుగో ఏడాది జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలో ప్రతిభ చూపినందుకు పతకాలు దక్కాయి. ఎంబీబీఎస్‌లో చేరిన కొత్తలో ఒత్తిడికి గురయ్యా. తల్లిదండ్రులు సీఎం అతావుల్లా, నూర్సత్‌కు మంచి పేరు తేవాలని సంకల్పించా. సీనియర్ల సలహాలు, ఆచార్యుల సహకారంతో మంచి మార్కులు సాధించా.- అయేషా తస్నీమ్