శ్రావణ మాసం నుంచి మొదలయ్యే పండగల వేళ.. ఉద్యాన పంటల ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. పండగ రోజులు, శుభకార్యాలను దృష్టిలో పెట్టుకొని పండ్లు, పూలు దిగుబడులు సాధించేలా రైతులు ప్రణాళిక చేసుకుంటారు. అయితే.. కారోనా కాటు నుంచి ఇంకా కోలుకోని ప్రజలు పండగలు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇవాళ నరకచతుర్దశి. అయినా.. అనంతపురం జిల్లాలో ఎక్కడా పండగ శోభ కనిపించటంలేదు. గృహాలకు పూల మాలల అలంకరణలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలు దీపావళి జరుపుకోటానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. దీంతో పూలకు డిమాండ్ బాగా తగ్గింది. దీంతో.. పూల ధరలు బాగా ఉంటాయని భావించి చామంతులు సాగుచేసిన రైతులు.. కోత కూలి కూడా దక్కక అల్లాడిపోతున్నారు.
దసరా నవరాత్రులకు గాని, దీపావళికి గాని మంచి రేట్లొస్తాయని ఈ పూలు సాగు చేసినాము. కానీ.. నవరాత్రులప్పుడు 20, 30 రూపాయలకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువకు పోలేవు. దీపావళికి కూడా ధరలు ఏ మాత్రం పెరగలేదు. ఈ సారి చానా నష్టపోయాం. ఎకరాకు లక్షా యాభై వేల వరకు పెట్టినం. పూలు అమ్ముకునేందుకు తీసుకెళ్తే... వచ్చే డబ్బులన్నీ కోత కూలీలకు, ట్రాన్స్పోర్ట్కే సరిపోవడం లేదు. పెట్టుబడి డబ్బులు కూడా రావట్లేదు ఈ సారి. - అనిల్, చామంతి పూల రైతు
జిల్లాలో 3వేల 724 హెక్టార్లలో రైతులు పూల సాగుచేస్తున్నారు. దీనిలో సింహభాగం చామంతి సాగు జరుగుతోంది. ఏటా పండగ సీజన్ లో చామంతి పూలు కిలో 200 నుంచి 300 రూపాయల వరకు ధర పలుకుతాయి. ఈసారి మామూలు రోజుల్లో కిలో పదికి కొనే దిక్కు లేకుండా పోయింది. దీపావళి పండగ ఉందని, అదనంగా కూలీలను పెట్టి చామంతులు కోసిన రైతులు మార్కెట్ లో కిలో 30 కి మించి ధర లేకపోవడంతో.. తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గుండుమల్లె, రోజా పూల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మల్లెలు దీపావళి రోజుల్లో కిలో 400 నుంచి 500 రూపాయలకు విక్రయించే వారు. ఈసారి వాటి ధర 200 లకు మించటంలేదు. రోజా పూల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కిలో కేవలం 70 నుంచి వంద మాత్రమే ధర పలుకుతోంది. కొవిడ్ తో కొనుగోలు శక్తి తగ్గటం.. కర్ణాటకలో అధిగ పూల దిగుబడి రావటం వల్ల అనంతపురం జిల్లా పూలకు ధర రావటంలేదని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.