అనంతపురం జిల్లా రైతులు ఏళ్లుగా వేరుశనగ సాగునే నమ్ముకున్నా... వారి కష్టాలు తొలగడం లేదు. ఆకుతోటపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి పరిస్థితి కూడా అంతే. ఎకరా పొలమున్న ఈ చిన్న రైతు... నాలుగు దశాబ్దాలుగా వేరుశనగనే సాగుచేస్తూ నష్టాలు చవిచూశాడు. ఈ ఏడాది మాత్రం ధైర్యం చేసి ఉల్లి పంట సాగుచేయాలనుకున్నాడు. ఆ ప్రాంత రైతులందరిలాగే ఆయనకు కూడా ఉల్లి సాగు గురించి ఎలాంటి అవగాహన లేదు. అయినా తెగించి తనకున్న ఎకరా పొలంలో... ఉల్లి సాగు చేశారు. పంట బాగా పండింది. మార్కెట్‌లో డిమాండ్ కూడా పెరిగింది. ఊహించని విధంగా మూడున్నర లక్షల రూపాయల ఆదాయం సాధించారు.
ఉల్లి సాగు చేయాలన్న ఆదినారాయణరెడ్డి నిర్ణయాన్ని మొదట్లో ఆయన భార్య, కుమారుడు వ్యతిరేకించారు. అవగాహన లేని పని అంటూ వారించారు. అయినా పట్టువదల్లేదు. పొలంలో విత్తనాలు చల్లాక ఉల్లి మొలకలు వచ్చాయి. చీడపీడలు కనిపించినపుడు తనకు తోచిన ఎరువులు, మందులు చల్లారు. పంట ఏపుగా వచ్చింది. ఓ వ్యాపారి టన్ను 82వేల రూపాయలు చెల్లించి నాలుగున్నర టన్నుల పంటను కొనుగోలు చేశాడు. దీంతో పంటకు సుమారు 3లక్షల 70వేల రూపాయల ఆదాయం వచ్చింది. ఇంకా 75 శాతం పంట విక్రయించాల్సి ఉందని రైతు భార్య ఆనందంగా చెబుతోంది.