రాయలసీమ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కూరగాయలు, పండ్లు ఎగుమతి చేయటం సులభమైంది. ఇప్పటివరకు అటువైపు ఏ ఉత్పత్తులను పంపాలన్నా 4 రోజులు పట్టేది. దీనివల్ల పంట నాణ్యత తగ్గిపోయేది. కొన్ని పాడైపోయేవి. దీంతో రైతులు నష్టాలు చవిచూడాల్సివచ్చేది. ఈ పరిస్థితులను గుర్తించిన కేంద్రప్రభుత్వం దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని అనంతపురం జిల్లా రైతులు బాగా ఉపయోగించుకుంటున్నారు. సెప్టెంబరులో తొలి కిసాన్ రైలు అనంతపురం నుంచి బత్తాయి పండ్లను తీసుకెళ్లింది. అప్పటినుంచి 3 సార్లు కిసాన్ రైలు జిల్లా నుంచి ఉద్యాన ఉత్పత్తులను దిల్లీ మార్కెట్కు తీసుకెళ్లింది. దీని వలన రవాణా ఖర్చులు సగానిపైగా ఆదా అవుతున్నాయని, రైతులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
అనంతపురం జిల్లా నుంచి రెండేళ్లుగా అరటి, దానిమ్మ పండ్లు తాడిపత్రి నుంచి రైలులో ముంబయి వెళ్లి అక్కడి నుంచి ఎడారి దేశాలకు ఓడల ద్వారా ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలైన ఐఎన్ఐ, ఫ్యూచర్ గ్రూపులతో చేసుకున్న ఒప్పందంతో ఆ సంస్థలు రైతులకు మెరుగైన ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. ఆ అనుభవాలతో కిసాన్ రైలులో రైతులు ఉత్పత్తులను పంపించటం అలవాటు చేసుకుంటున్నారు. తొలిసారి పంపిన కిసాన్ రైలులో బత్తాయి, దానిమ్మ పండ్లను ఎగుమతి చేశారు.
కిసాన్ రైలు ప్రవేశపెట్టాక రవాణా ఛార్జీలో రైతులకు 50 శాతం రాయితీ వస్తోంది. మిగిలిన 50 శాతం చెల్లించిన తరువాత ఉత్పత్తులను బోగీలోకి లోడు చేస్తారు. రాయితీపోగా రైతులు టన్నుకు రూ.2750 రూపాయలు చెల్లించాలి. అయితే ఈ మొత్తం చెల్లించటం కూడా రైతులకు భారంగా మారటంతో కిసాన్ రైలులో రవాణా చేయటానికి ఎవరూ ముందుకు రావటంలేదు. అన్నదాతల ఇబ్బందిని గుర్తించిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రత్యేకంగా ఓ నిధిని ఏర్పాటు చేయించారు. దాతలు ఇచ్చిన విరాళాలతో రైతులకు సరకు రవాణా ఛార్జీల నిమిత్తం 50 శాతం డబ్బు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రైతులు ఉత్పత్తిని విక్రయించాక, తిరిగి అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది. దిల్లీలో అనేక ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, వాటన్నింటినీ అనంతపురం నుంచి ఎగుమతి చేయటానికి ప్రణాళిక చేసినట్లు కలెక్టర్ చెప్పారు.