అనంతపురం జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగటంతోపాటు మరణాలు అధికమవుతున్నాయి. మంగళవారం కొత్తగా 185 మందికి వైరస్ సోకగా, 10 మంది మృతిచెందారు. జిల్లాలో ఇప్పటివరకు 3,651 మందికి కొవిడ్ సోకింది. మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 రోజుల్లోనే 16 మంది చనిపోవడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. రాబోయే 2 నెలల్లో వైరస్ మరింత విజృంభిస్తుందని.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న పరీక్షలు-అధికమవుతున్న కేసులు
జిల్లావ్యాప్తంగా 6 ప్రయోగశాలల ద్వారా రోజూ 2 వేల నమూనాలు పరీక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 1200 నమూనాలు పరీక్షిస్తుండగా.. ట్రానాట్ ప్రయోగశాలల్లో 800 పరీక్షలు చేస్తున్నారు. కొవిడ్ పరీక్షలు పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. 5 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెొప్తున్నా.. క్షేత్రస్థాయిలో వెయ్యి పడకలు కూడా సమకూర్చలేని పరిస్థితి కనిపిస్తోంది. వైరస్ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంటిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.