attack on lovers: అనంతపురంలో కిడ్నాపర్ల నుంచి ప్రేమికులను పోలీసులు కాపాడిన సంఘటన మంగళవారం జరిగింది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల నవీన్‌కుమార్, ఇర్ఫాన బేగం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం రాప్తాడు సమీపంలోని పండమేరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం పెద్దలకు ఇష్టం లేకపోవడంతో నవీన్‌కుమార్‌ను కిడ్నాప్ చేయాలని యువతి తరఫు బంధువులు ఏడుగురు కుట్రపన్నారు.
పెళ్లి చేసుకున్న ప్రేమికులు నగరంలోని అరవింద్‌నగర్‌లో ఓ దుకాణంలో అంతకుముందే ఉంచిన తమ దుస్తులు తీసుకొనేందుకు వచ్చారు. ఇది గమనించిన అమ్మాయి తరఫు బంధువులు యువకుడిని ఓ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. వీరి నుంచి తప్పించుకున్న యువతి జిల్లా ఎస్పీని సంప్రదించింది. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలతో డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో రెండో పట్టణ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.