ప్రభుత్వం విక్రయించే మద్యం తరహాలోనే లేబుల్ వేసి నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ముఠాను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం మండలంలోని గ్రామాల్లో విస్కీ, క్వార్టర్ సీసాల అమ్మకాలపై దృష్టిపెట్టిన పోలీసులు నకిలీ మద్యం ముఠాను పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన బద్వేల్ జిలానీ బాషా 2011లో ఇంజినీరింగ్ పూర్తి చేసి పలుచోట్ల పనిచేశాడు. సులభ మార్గాల్లో అధిక సొమ్ము సంపాదించాలని నకిలీ మద్యం విక్రయాలు చేస్తున్నాడు.
బళ్లారికి చెందిన స్పిరిట్ సరఫరాదారుడితో పరిచయం ఏర్పడి... అక్కడి నుంచి స్పిరిట్ కొనుగోలు చేసి, బెంగళూరు నుంచి ఖాళీ సీసాలు, మూతలు కొన్నాడు. సీసాలకు సీలు వేసే యంత్రాన్ని గుజరాత్ నుంచి పదకొండు వేల రూపాయలకు కొనుగోలు చేసిన జిలానీ బాషా.. మరో ముగ్గురితో కలిసి అనంతపురం నగర శివారులోని కక్కలపల్లిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. ఈ నకిలీ మద్యాన్ని హర్షవర్దన్ రెడ్డి, సుబ్బమ్మల ద్వారా గ్రామాల్లో బెల్టు షాపులకు విక్రయించే ఏర్పాట్లు చేసుకున్నారు. ధర్మవరం, కళ్యాణదుర్గంలో ఇలా కొంతమందిని ఏర్పాటు చేసుకొని, స్టాకును వారికి పంపి.. అక్కడి నుంచి సరఫరా చేయించేవాడు.