రాష్ట్రం వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నా... అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చుక్క వాన నేలరాలలేదు. ఒక వైపు వాగులు వంకలు పొంగుతున్నా... మరోవైపు నేల నెరలు తీస్తుంది. వర్షదేవుడు కరుణించకపోయినా.. భూమాత ఆదరిస్తోందని బోర్లు వేసిన అన్నదాతలకు నిరాశే ఎదురవుతోంది. వేలు ఖర్చు పెట్టి వేసిన బోర్లలలో నీరు పడకపోవటంతో చేసేదిలేక రైతన్నలు బలన్మరణానికి పాల్పడుతున్నారు.
బోరుమనిపిస్తున్న బోర్లు...అనంతలో అన్నదాతల ఆత్మహత్యలు! - ఏపీ తాజా వార్తలు
కరవు సీమ అనంతపురంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. వేలు ఖర్చు చేసి బోర్లు వేసినా చుక్క నీరు కూడా రాకపోవటంతో రైతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వందల అడుగుల లోతులో బోరు వేసినా నీరు ఉండకపోవటంతో కలత చెందుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై తనువు చాలిస్తున్నారు.
ఈ ఒక్క నెలలోనే అనంతపురం జిల్లాలో ఆరుగురు రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడ్డారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచుతూ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 50 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా అందులో 33 మందిని మాత్రమే ప్రభుత్వం పరిహారానికి అర్హులుగా పేర్కొంది. రైతులు అధిక సంఖ్యలో బోర్లు వేయడం, నీరు పడకపోవడమే బలవన్మరణాలకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున బోర్లు వేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి :శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్