ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దస్త్రం కదలాలంటే..దండిగా చెల్లించాల్సిందే! - అనంతపురం జిల్లా వార్తలు

గతంలో ఓ అధికారి ఓ కంపెనీ ప్రతినిధిని బెదిరించి లంచం అడిగారు. అప్పట్లో ఫోన్‌కాల్స్‌ రికార్డు బయట పడటంతో చర్చనీయాంశమైంది. తాజాగా విడపనకల్లు వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి ఎరువుల దుకాణ డీలరును డబ్బు అడిగినట్లుగా ఫోన్‌కాల్‌ రికార్డు బయటపడింది. దీంతో ఆమెను సస్పెండ్‌ చేశారు. అలాగే డీలర్ల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.2 లక్షలు ఓ డివిజన్‌స్థాయి అధికారి జిల్లా స్థాయి అధికారికి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్నిబట్టి ఆ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

ananthapuram
ananthapuram

By

Published : May 6, 2021, 11:42 AM IST

అనంతపురం జిల్లా సచివాలయం ‘ఎవరు చెప్పినా వినం.. మామూళ్లు ఇస్తేనే దస్త్రాలు కదులుతాయి. లేకపోతే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. దుకాణం బంద్‌ చేసి తిరిగితే మీకే నష్టం. అడిగిన సొమ్ము ముట్టజెప్పి సంతకాలు చేయించుకుంటే ఎక్కడా ఎవరికీ సమస్య రాదు. మీరు బాగుంటారు.. మేము బాగుంటాం..’ ఇదీ వ్యవసాయ శాఖలోని కొందరు అధికారుల తీరు. ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయించి దందా చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల పేర్లు చెప్పి ఎరువుల దుకాణ డీలర్ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు.

నష్టాల్లో ఉన్నా వదలరే..

గతేడాది నుంచి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్‌బీకేల్లో రైతులు పేర్లు నమోదు చేసుకుంటే పంపిణీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో వాడకం తగ్గింది. ప్రైవేటు దుకాణాల్లో వ్యాపారం మందగించింది. అయినా ప్రతి దుకాణం నుంచి మామూళ్లు ఇవ్వాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్నాం.. సొమ్ము చెల్లించలేమని డీలర్లు చెబుతున్నా కొందరు వ్యవసాయాధికారులు హుకుం జారీ చేస్తున్నారు.

నవీకరణ పేరుతో..

సాధారణంగా ఎరువులు, విత్తనాల డీలర్లు తమ దుకాణాల లైసెన్సులు ఐదేళ్లకొకసారి రెన్యూవల్‌ చేసుకోవాలి. హోల్‌సేల్‌ డీలర్లు కూడా ఐదేళ్లకొకసారే. పురుగు మందుల డీలర్లయితే ఏటా డిసెంబరులో రెన్యూవల్‌ చేయాలి. జిల్లా, రాష్ట్రస్థాయిలో లైసెన్సులు నవీకరిస్తారు. ఎరువుల లైసెన్సు రెన్యూవల్‌ లేదా కొత్తగా అవసరమైతే మండల వ్యవసాయాధికారి దరఖాస్తు చేసుకోవాలి. డివిజనల్‌ స్థాయి అధికారి జారీ చేస్తారు. హోల్‌సేల్‌ వ్యాపారి అయితే జిల్లాస్థాయి అధికారులకు పంపాలి. ఎంఏవో నుంచి ఏడీఏ, ఏడీఏ నుంచి ఏడీపీపీకి, ఏడీపీపీ నుంచి జేడీఏకు దరఖాస్తు వెళుతుంది. రాష్ట్ర లైసెన్సు అయితే కమిషనర్‌కు పంపుతారు. విత్తనాలు, పురుగు మందులకు మండల వ్యవసాయాధికారి నుంచి నేరుగా ఏడీపీపీకి, జేడీఏకు పంపిస్తారు. దరఖాస్తు ముందుకు కదలాలంటే అన్నిస్థాయిల అధికారులకు మామూళ్లు ఇవ్వాల్సి వస్తోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ అవినీతి లెక్క..

‘0’ ఫారానికి రూ.1000-2000, అన్ని రకాల లైసెన్సుల రెన్యూవల్‌కు రూ.10-15 వేలు, జీవన ఎరువుల అమ్మకాలకు రూ.10-15 వేలు, రాష్ట్రస్థాయి తనిఖీ బృందాలు వస్తే రూ.15-20 వేలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలకు కొత్త లైసెన్సులకు రూ.40-50 వేలు ఇచ్చుకోవాల్సిందేనని డీలర్లు ఆరోపిస్తున్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో ఈ-పంట నమోదుకు గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, పట్టుశాఖ సహాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో రైతు నుంచి రూ.1000-2000 వసూలు చేసినట్లు పలువురు వ్యవసాయాధికారులే చెప్పడం గమనార్హం.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

డీలర్ల నుంచి వ్యవసాయాధికారులు వసూళ్లు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. రాతపూర్వకంగా ఫిర్యాదులు అందితే విచారించి చర్యలు తీసుకుంటాం. డీలర్లు లైసెన్సులు రెన్యూవల్‌ చేసుకోవాలి. కొత్తగా లైసెన్సులు తీసుకోవాలి. అనుమతిలేని ఎరువులు, మందులు, విత్తనాలు అమ్మడానికి లేదు. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే సంతకాలు చేసి పంపుతాం. - రామకృష్ణ, జేడీఏ

  • దుకాణాల సంఖ్య ఇలా..
  • ఎరువులు : 915
  • పురుగు మందులు : 750
  • విత్తనాలు : 840

ఇదీ చదవండి:కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు

ABOUT THE AUTHOR

...view details