అనంతపురం జిల్లాలోని మడకశిర పట్టణానికి పెనుకొండ, హిందూపురం పట్టణాలు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటితో పాటు బెంగళూరు మడకశిరకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. మడకశిర పట్టణంలో బైపాస్ రోడ్డు లేనందున మడకశిర మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే గూడ్స్ వాహనాలు, లారీలు, టెంపోలు, కంటైనర్లు, కార్లు ఇతర వాహనాలు పట్టణంలోని అంబేడ్కర్ కూడలి నుంచి వెళ్తుంటాయి. ముఖ్యంగా ఈ కూడలిలో హిందూపురం, పెనుకొండ, పావుగడ ప్రాంతాలకు వెళ్లేందుకు వేరువేరుగా మూడు రహదారులు ఉన్నాయి.
అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గాలు సూచించే బోర్డులు కూడలిలో లేనందున ఒక మార్గానికి వెళ్లాల్సిన వాహనదారులు.. పది కిలోమీటర్ల దాకా మరొక మార్గంలో వెళ్లి గమ్యం తప్పామని గుర్తించి తిరిగి వెనక్కు వస్తున్నారు. ఇలా ప్రతి రోజు చాలామంది వాహనదారులు ఈ తికమకతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మడకశిర పట్టణం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.