BENGALGRAM FARMERS FIRE ON AP GOVT: శనగ సాగు చేసిన రైతుల్ని దళారీలు నిలువు దోపిడీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ.. ఎక్కాడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. దళారీలు తక్కువ ధరకే దోచుకుంటున్నారు. పంట నూర్పిళ్లు పూర్తి చేసిన రైతులు.. మద్దతు మాట అటుంచి పంటను అమ్ముకుంటే చాలన్న దయనీయ స్థితి నెలకొంది.
అనంతపురం జిల్లాలో నల్లరేగడి వర్షాధార భూముల్లో ఏటా రైతులు శనగను సాగు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి.. 63 వేల హెక్టార్లలో శనగ పప్పును సాగు చేశారు. చలి తీవ్రత, మంచు బాగా కురవటంతో దిగుబడులు పెరిగాయి. ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో.. పంటను అమ్ముకోవచ్చని ఎదురు చూసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది.
గతేడాది శనగ పప్పుకు కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.5,230 ధర నిర్ణయించగా, ఈసారి క్వింటాకు 5,335 రూపాయలుగా ప్రకటించింది. కేంద్రం మద్దతు ధర ప్రకటించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం శనగ పప్పు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో పంట నూర్పిళ్లు చేసి రైతులు.. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకపోవడంతో.. దళారీలను ఆశ్రయిస్తున్నారు. మద్దతు ధర కంటే వెయ్యి రూపాయల తక్కువకే దళారులు పంటను కొనుగోలు చేస్తూ రైతుల్ని దోచుకుంటున్నారు.
మరోవైపు శనగ పప్పు రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటన ఇచ్చారు. కానీ.. కొనుగోలు కేంద్రాలు ఎప్పటినుంచి తెరుస్తారోనన్న స్పష్టత ఇవ్వకపోవడంతో పంట నూర్పిళ్లు పూర్తి చేసిన రైతులు.. తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి