అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి గ్రామంలో 2006 తరువాత 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ఇవ్వలేమని కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. తాడిమర్రి మండలంలో సీబీఆర్ ప్రాజక్టు ముంపు బాధితులైన యువతకు పరిహారం చెల్లించలేమన్నారు. మర్రిమాకులపల్లి గ్రామంలో గతంలో ఇవ్వలేకపోయిన 119 మంది ఎస్సీలతో పాటు, అర్హులైన మరో 110 మందికి మాత్రమే త్వరలో పరిహారం ఇస్తామని చెప్పారు.
ఆ గ్రామంలో ఉన్న 110 మందికి... 2006 నోటిఫికేషన్ తరువాత 18 ఏళ్లు నిండాయని, అందువల్ల పరిహారం ఇవ్వడానికి వీలులేదన్నారు. గతంలో కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేసేవారని, ఈసారి పది టీఎంసీలు నిల్వచేయాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. అందువల్లే మర్రిమాకుల పల్లి గ్రామాన్ని ఖాళీ చేయించాల్సి వచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్దంగా పరిహారం కావాలని ఆందోళన చేస్తే కుదరదని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామంలో కొనసాగుతున్న అధికారుల దాష్టీకంపై కలెక్టర్ గంధం చంద్రుడు దాటవేశారు. కలెక్టర్ వ్యాఖ్యలతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.