EXPRESS WAY : కోస్తా, రాయలసీమను అనుసంధానించే కీలకమైన అనంతపురం అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం అడుగు ముందుకుపడటం లేదు. ఐదేళ్ల క్రితం ప్రతిపాదించిన దీని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్నా.. వైకాపా ప్రభుత్వం ప్రతిపాదనలు మార్చుతుండటంతో ఎడతెగని జాప్యం జరుగుతోంది. స్వరూపం మార్చినా.. అసలు ఇది ఉంటుందా, ఉండదా? ఉంటే ఎప్పటికి పనులు ప్రారంభమవుతాయనే ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానాలు దొరికేలా లేవు.
రాయలసీమ జిల్లాలను అమరావతితో అనుసంధానించే సరైన రహదారి లేదు. సీమ జిల్లాల నుంచి సగటున దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికే సరైన రహదారి లేక 7గంటల వరకూ సమయం పడుతోంది. అదే దాదాపు 800కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు వెళ్లాలంటే 15గంటల వరకూ సమయం పడుతోంది.
గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఖరారు చేశాక.. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ప్రణాళికలు సిద్ధం చేసింది. అనంతపురం, కర్నూలు, కడప నుంచి నేరుగా అమరావతికి నాలుగు గంటల్లోగా వచ్చేందుకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ అవసరాన్ని గుర్తించి.. ప్రాజెక్టు నివేదిక తయారుచేసి కేంద్రానికి పంపింది. భూ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసింది. కేంద్రమూ జాతీయ రహదారిగా గుర్తించి.. ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది.
ప్రాజెక్టు భూసేకరణ వ్యయంలో సగం భరించేందుకు కేంద్రం సుముఖత చూపింది. ఆరేళ్ల క్రితమే అంటే 2016 ఆగస్టు నాటికే ఈ ప్రాజెక్టుకు ఓ రూపం వచ్చింది. దాదాపు 400 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాలని ఖరారు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం.. 27,635 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులోనే భూసేకరణ ఖర్చు.. 2,500 కోట్లు ఉంటుందని తేల్చారు. NHAI ఈ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ముందుకొచ్చింది. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిన వ్యవహారం ఉంది.
ప్రాజెక్టును ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు.. గత ప్రభుత్వం ఎన్నో సమస్యలను అధిగమించింది. రహదారి నిర్మాణానికి 26,890 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ప్రభుత్వ-ప్రైవేటు భూమి 23,041 ఎకరాలుంటే, ఇందులో ప్రైవేటు భూమి 19వేల ఎకరాలుంది. మరో 3849 ఎకరాల అటవీ భూమి సేకరించాలని నిర్ణయించారు. అటవీ భూమిని తీసుకుని.. అంతే మొత్తంలో అటవీశాఖకు తిరిగి భూమి ఇచ్చేలా ప్రయత్నాలు జరిగాయి.