రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా సమస్యగా మారింది. నూతన విధానాలు, ధరలు, రవాణా ఖర్చు తదితర కారణాలతో సామాన్యుడు ఇసుక కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా.. తనవంతు ఎప్పుడు వస్తుందో వినియోగదారులకు తెలియదు. దీనికితోడు ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో రీచుల్లో నీరు చేరి ఇసుక తవ్వకం కష్టంగా మారింది. ప్రస్తుత నిల్వలు 50 శాతం అవసరాలను కూడా తీర్చడం లేదు. రీచ్ నుంచి స్టాక్‌యార్డుకు.. అక్కడి నుంచి ఇంటి నిర్మాణం జరిగే ప్రదేశానికి అయ్యే రవాణా ఖర్చులు వినియోగదారుడు భరించాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా తయారీ ఇసుక తెరపైకి వచ్చింది. సహజ ఇసుకతో పోలిస్తే ధర తక్కువగా ఉండటంతో చాలామంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు.
పెరిగిన వినియోగం..
కంకర రాళ్లను యంత్రాల ద్వారా పొడిగా చేసి ఇసుక తయారు చేస్తారు. దీన్నే తయారీ ఇసుక (మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్) అంటారు. ఇంజినీరింగ్ పరిభాషలో ఎం.శాండ్ అని కూడా పిలుస్తారు. ధర తక్కువ, సులభ రవాణాకు వీలుండటంతో పట్టణ ప్రాంతాల్లో భవనాల నిర్మాణానికి ఎక్కువగా వాడుతున్నారు. గతంలో దీనిపై కొన్ని అపోహలు ఉండటంతో ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. నాణ్యతపై నమ్మకం కలగడంతో ప్రస్తుతం వినియోగం పెరిగింది. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో దాదాపు 30 శాతం మేర భవన నిర్మాణాలకు తయారీ ఇసుకనే వాడుతున్నారు.
తక్కువ ధరకే..
ఉదాహరణకు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఒక వినియోగదారుడు ఒక లారీ ఇసుక తెచ్చుకోవాలంటే సుమారు రూ.12 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టన్ను ఇసుక రూ.375 ఉన్నప్పటికీ రవాణా ఖర్చు భారీగా పెరిగింది. రీచ్ నుంచి స్టాక్ యార్డుకు సగటున రూ.4,600, అక్కడి నుంచి వినియోగదారుడి ఇంటికి రూ.3,300 ఖర్చవుతోంది. ఈ మొత్తం వినియోగదారుడే చెల్లించాలి. డ్రైవర్ మామూళ్లు, ఇతర ఖర్చులు కలుపుకొని 10 టన్నుల ఇసుకకు సగటున రూ.11 వేలు అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో రూ.12 వేల దాకా వ్యయమవుతోంది. అయితే తయారీ ఇసుక టన్ను ధర రూ.400 నుంచి రూ.500 ఉన్నప్పటికీ రవాణా ఖర్చులు తగ్గిపోతున్నాయి. నేరుగా పరిశ్రమ నుంచి తీసుకోవడంతో సరఫరాకు రూ.3,500 నుంచి రూ.4,000 దాకా వ్యయమవుతోంది. మొత్తంగా 10 టన్నుల తయారీ ఇసుక రూ.8 వేలు నుంచి రూ.9 వేలకు లభిస్తోంది.
ప్రమాణాలతో నాణ్యత..
సహజ ఇసుకతో పోలిస్తే నాణ్యతలో తయారీ ఇసుక ఏమాత్రం తీసిపోదు. భారత ప్రమాణాల ప్రకారం (4.75 ఎంఎం- 2.36 ఎంఎం) తయారీ ఇసుక దృఢత్వాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2.36 ఎంఎం కంటే తక్కువగా ఉన్న తయారీ ఇసుకను ప్లాస్టరింగ్‌లోనూ ఉపయోగించవచ్చని అంటున్నారు. సహజ ఇసుకలో సగటున 6 శాతం మేర వ్యర్థాలు ఉండటం వల్ల నాణ్యత దెబ్బతింటోందన్నారు. అయితే కంకర తయారీ పరిశ్రమల నుంచి వచ్చే దుమ్మును తయారీ ఇసుకగా నమ్మించి కొందరు అమ్ముతున్నారని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
చౌకగా.. వేగంగా: