అనంతపురం జిల్లా రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అద్దెకు ఇచ్చే కేంద్రాలకు రూ.100 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఏడీసీసీ బ్యాంకు అధ్యక్షుడు వీరాంజనేయులు తెలిపారు. ఆదివారం అనంతపురంలోని ప్రధాన కార్యాలయంలో మేనేజర్లతో ఉపకరణాల అద్దె కేంద్రాల స్థాపనపై సమావేశం నిర్వహించారు.
రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు మిత్ర సంఘాలకు రుణం మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కేంద్రాల స్థాపనకు ఆయా సంఘాలు ముందుకొచ్చి రైతులకు వ్యవసాయ రంగంలో చేయూతనందించాలని ఆయన పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. బ్యాంకు సిబ్బంది సాహసంతో విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన కొనియాడారు.