కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి అందించే ఏబీసీడీ అవార్డులు అనంతపురం జిల్లా పోలీసులను వరించాయి. తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలోని శివాలయంలో ముగ్గురి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న కదిరి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు ఏబీసీడీ అవార్డు దక్కింది.
అలాగే బుక్కపట్నం మండలం, సిద్ధరాంపురంలో గతేడాది గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు శవాన్ని గుర్తుపట్టలేని విధంగా కాల్చారు. ఈ కేసును కూడా పోలీసులు ఛేదించి నిందితులను కటాకటాల్లోకి నెట్టారు. ఈ కేసుకు సైతం అవార్డు దక్కింది. జిల్లాకు రెండు ఏబీసీడీ అవార్డులు రావడంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.