అనంతపురం జిల్లాలో మంచి పిల్లల శస్త్రచికిత్స నిపుణులు ఎవరని అడిగితే ఆ జిల్లా ప్రజలు డాక్టర్ హరిప్రసాద్ పేరు చెబుతారు. హ్యాపీస్టార్ హరి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇట్టే చెప్పేస్తారు. హాస్య వీడియోలతో ఎంతో మందికి దగ్గరైన డాక్టర్ హరిప్రసాద్ తన వైద్యంతో ఎంతోమంది చిన్నారులకు ప్రాణం పోశారు. మంచి విషయం చెబితే ప్రజలెవరూ వినరనే ఉద్దేశంతోనే తొలుత హాస్యంతో అందరికీ దగ్గరై వాటి ద్వారా ప్రజలకు ప్రయోజనకర విషయాలు అందిస్తున్నారు.
రామచంద్ర మిషన్‌లోని తన గురువు చేసిన మార్గదర్శనంతో 2015లో ధ్యానకేంద్రం ఏర్పాటు చేసిన హరిప్రసాద్.. తొలుత యోగా, ధ్యానం గొప్పతనం చెబితే సామాజిక మాధ్యమాల్లో ఎవరూ వినేవారు కాదని చెప్పారు. వారిలో ఆనందాన్ని నింపేందుకు హాస్యాన్ని మార్గంగా ఎంచుకున్నారు. 2017 నుంచి తక్కువ నిడివితో వీడియోలు చేస్తూ వచ్చిన ఆయన ఏటికేడు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లారు. మిత్రుల సహకారంతో అబ్బా ఛానెల్‌ను ప్రారంభించిన ఆయన ఆదరణ పెరిగాక అనంతపురం యాక్టర్ల సంఘం ఏర్పాటు చేశారు. దానికి అయాసం అని నవ్వు ధ్వనించే పేరు పెట్టి స్థానిక నటీనటులకు మరింత దగ్గరయ్యారు.
దాదాపు 950 వరకూ వీడియోలు అప్‌లోడ్ చేస్తే వీటిలో 400 దాకా విశేష ప్రజాదరణ పొందాయి. టాలెంట్ ఉన్నా అందంగా లేమనే ఆత్మన్యూనతా భావనతో ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులకు.. అబ్బా ఛానెల్ ఓ వరంలా మారుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న ఎంతోమందికి హరిప్రసాద్ వీడియోలు ఓ టానిక్‌లా ఉపయోగపడ్డాయి. సామాజిక బాధ్యతగా కరోనాపై అవగాహన కల్పిస్తూ ఎన్నో వీడియోలు చేశారు. నిత్యం ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలకు నవ్విస్తూనే పరిష్కారం అందించారు. ఎవరికీ అర్థం కాని హ్యాండ్ రైటింగ్‌తో మందులచీటీ రాసే హరిప్రసాదే అందరికీ అర్థమయ్యేలా స్క్రిప్టులు రాసి ఆకట్టుకున్నారు.