అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి ఆస్పత్రి ఆవరణలోనే ఊపిరాడక మృతి చెందాడు. బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండగా బంధువులు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో కొవిడ్‌కు చికిత్స సదుపాయం లేదని.. అనంతపురం తరలించాలని వైద్యారోగ్య అధికారి డాక్టర్ కృష్ణవేణి సూచించారు. వాహనం వచ్చేలోపే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
బాధితుణ్ని ప్రత్యేక వాహనంలో తరలించాలని ఏర్పాట్లు చేస్తుండగా.. ఈలోపే మృతి చెందినట్లు వైద్యాధికారిణి కృష్ణవేణి తెలిపారు. మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేలా రెవెన్యూ అధికారులకు సిఫారసు చేసినట్లు తెలిపారు. మృతుని బంధువులకు పీపీఈ కిట్లు అందించామని వివరించారు.