ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుంగదీస్తున్నాయి క్యాన్సర్‌ కణాలు... ఆదుకోవాలని ఓ కుటుంబం వేడుకోలు...

పేదరికాన్ని జయించాలంటే చదువే ఆయుధమని గుర్తించింది ఆ అమ్మాయి.  ఇష్టంగా కష్టపడుతూ అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఆమెను అనారోగ్యం వెంటాడింది. జీవచ్ఛవంలా మార్చేసింది. మంచానికే పరిమితమైన ఆమె... దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.

స్వప్న

By

Published : Nov 3, 2019, 9:02 AM IST

క్యాన్సర్​తో బాధపడుతోన్న అమ్మాయికి సాయం కోసం కుటుంబం వేడుకోలు

కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన వెంకట్రాముడు, అరుణ దంపతులు కొన్నేళ్ల క్రితం అనంతపురం వచ్చి సోమనాథనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వెంకట్రాముడు లారీ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కూతురు స్వప్న, కుమారుడు వినయ్‌ ఉన్నారు. శారదా మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న స్వప్న... సత్యసాయి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకొని సాగుతున్న ఆమె ఒక్కసారిగా అనారోగ్యం పాలైంది.
ఉన్నట్లుండి కాలి నొప్పితో స్వప్న ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు జరిపిన వైద్యులు ఎడమ మోకాలికి క్యాన్సర్‌ ఉందని తేల్చారు. నాణ్యమైన చికిత్స అందించకుంటే ప్రాణాలు దక్కవని చెప్పారు. అంతే.. కళ్లముందున్న స్వప్నం కరిగిపోతున్నట్లయింది ఆ కన్నవారికి. బిడ్డను బతికించుకునేందుకు తెలిసిన చోటల్లా అప్పు చేసి హైదరాబాద్​లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
ఇప్పటి వరకు ఐదుసార్లు కీమోథెరపీ చేయించారు. మోకాలి భాగంలో ఉన్న క్యాన్సర్‌ గడ్డను ఆపరేషన్‌ చేసి తొలగిస్తే బతకడానికి అవకాశాలున్నాయనీ.. అందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆలస్యమైతే క్యాన్సర్‌ కణాలు విస్తరించే ప్రమాదం ఉందనీ.. సాధ్యమైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించాలన్నారు. ఆపరేషన్ చేయించే స్తోమత లేక దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం.
ఆర్థిక సాయం చేయదలచినవారు బాలిక తండ్రి వెంకట్రాముడు చరవాణి 63002 48141 నెంబరుకు సంప్రదించాలని వేడుకుంటోంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details