ప్రముఖ గాయని సునీత పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై అనంతపురంలో కేసు నమోదైంది. నిందితుడి చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లాలోని రామగిరి మండలానికి చెందిన చైతన్య అనే వ్యక్తి... తాను సింగర్ సునీత పీఏనని చెప్పి.. అనంతపురం నగర శివారులోని రుద్రంపేటకు చెందిన రమేశ్‌ను నమ్మబలికాడు. సునీతతో ఈవెంట్ ఇప్పిస్తానని చెప్పి తన నుంచి చైతన్య ఐదు లక్షలు ఇప్పించుకున్నట్లు బాధితుడు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఇలాంటి తప్పుడు మాటలు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు సీఐ సూచించారు. అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.