TOMATO CROP DAMAGED: అనంతపురం జిల్లాలో టమాటా పంట కుళ్లి చేతికి రాకుండా పోయింది. వారం రోజులకు పైగా కురిసిన వర్షాలతో తోటల్లో నీరు నిలిచి .. 80 శాతానికి పైగా పంట పాడైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 698 హెక్టార్లలో ఈ పంట సాగుచేశారు. ఎకరాకు 35 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టారు. కానీ పంటంతా వర్షార్పణమైంది. కొద్దోగొప్పో మిగిలిన పంటను మార్కెట్‌కు తెచ్చినా.. కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దెబ్బతిన్న పంటను తీసుకోకుండా ..మండీ యజమానులు, వ్యాపారులు వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి భారీ వర్షాలు కురిశాయి. సగానికి పైగా మండలాల్లో 6 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడింది. దీని వల్ల టమాటా తోటల్లో నీరు నిలిచి .. ఎగుమతి చేసేంత నాణ్యత రాలేదు. ఏం చేయాలో పాలుపోక రైతులు పంటను పశువులు, గొర్రెలకు వదిలేస్తున్నారు.