Polluted Drinking Water: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం బేలోడు లో గత రెండు రోజుల క్రితం తాగునీరు కలుషితం కావడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారంతా రాయదుర్గం, అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వారిలో కరియమ్మ అనే మహిళ అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మరణించింది. గ్రామంలో తాగునీటి కుళాయిల వద్ద మురికి మీరు నిల్వ ఉండడంతో కలుషితమైన తాగునీరు సరఫరా కావడంతో గ్రామ ప్రజలు వాటిని తాగారు. వంటలకు కూడా వాడటంతో వాంతులు విరోచనాలు అధికమై ఆసుపత్రుల పాలయ్యారు. గ్రామంలోని ఓవర్ ట్యాంకు సంవత్సరం కావస్తున్న బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయకపోవడంతో తాగునీరు కలుషితమైనట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
గ్రామంలోని బీసీ కాలనీలో తాగునీటి పైపులు రోడ్డు కింద భాగంలో ఉండడంతో.. కలిషితమైన నీరు పైపుల్లోకి తిరిగి వెళ్లి రంగు మారిన నీరు సరఫరా అవుతున్నాయి. గ్రామంలోని పెద్ద మసీదు వద్ద నెలల కొద్ది నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు అధికం కావడంతో పాటు తాగునీరు అపరిశుభ్రంగా మారినట్లు కాలనీవాసులు వాపోయారు. గ్రామపంచాయతీ వారు కానీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో నిండు ప్రాణం బలైనట్లు గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న మరో పది మందిని అనంతపురం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. గ్రామంలో పరిశుభ్రత చర్యలు చేపట్టి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైద్య శిబిరం కోసం గ్రామంలో అరకొరగా ఏర్పాట్లు చేయడం వల్ల గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.