ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 Acres Land to Dr Sake Bharati: కష్టానికి ప్రతిఫలం.. సాకే భారతికి రెండు ఎకరాల భూమి.. జూనియర్ లెక్చరర్ పోస్ట్..!

Government Allotted 2 Acres of Land to Dr Sake Bharati: కూలీ పని చేస్తూ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన సాకే భారతికి ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి పట్టాను అందజేశారు. అదే విధంగా ఆమె అంగీకరిస్తే.. జూనియర్ లెక్చరర్ పోస్ట్‌ని ఇస్తామని అన్నారు.

sake bharati
సాకే భారతి

By

Published : Jul 31, 2023, 10:58 PM IST

Updated : Aug 1, 2023, 6:21 AM IST

Government Allotted 2 Acres of Land to Dr Sake Bharati: కూలి పని చేస్తూ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్​డీ పూర్తి చేసిన సాకే భారతికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున సాకే భారతికి రెండు ఎకరాల భూమి పట్టా జిల్లా కలెక్టర్ గౌతమి అందజేశారు.

జిల్లాకే గర్వకారణం: కూలీ పని చేస్తూ కెమిస్ట్రీలో సాకే భారతి పీహెచ్‌డీ పూర్తి చేయడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ గౌతమి అన్నారు. అనంతపురం కలెక్టరేట్​లోని రెవెన్యూ భవనంలో అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగలగుడ్డం గ్రామానికి చెందిన సాకే భారతి.. జిల్లా కలెక్టర్​ని కలిశారు. శింగనమల మండలం సోదనపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ 9 - 12లో రెండు ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాను సాకే భారతికి జిల్లా కలెక్టర్ అందజేశారు.

యువతకు రోల్ మోడల్: సంకల్పం గట్టిగా ఉంటే మన విజయాన్ని ఏది ఆపదు అనేదానికి సాకే భారతి నిదర్శనమని, ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఆమె అనుకున్నది సాధించి డాక్టర్ సాకే భారతిగా పేరు పొందారని కలెక్టర్ అన్నారు. ఇది ఎంతో గొప్ప విషయమని, ఇతరులకు ఆదర్శవంతంగా నిలిచి ఆమె యువతకు రోల్ మోడల్​గా మారిందన్నారు.

ఆమె ఇంటిని కూడా పూర్తి చేస్తాం: జిల్లా యంత్రాంగం నుంచి సాకే భారతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తమ వంతు సాయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని కూడా పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఆమె ఒప్పుకుంటే జూనియర్ లెక్చరర్ పోస్ట్​: సాకే భారతి ఎస్కేయూలో కెమిస్ట్రీలో పీహెచ్​డీ చేశారని, ఆమెకు ఉద్యోగ అవకాశం కింద జూనియర్ లెక్చరర్ పోస్ట్​ని గుర్తించడం జరిగిందని, ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టు కెమిస్ట్రీలో ఖాళీగా ఉందని తెలిపారు. ఆమె ఒప్పుకుంటే ఆ పోస్టుకు ఆమెను నామినేట్ చేయడం జరుగుతుందన్నారు.

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమెకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేదానికి సాకే భారతి ఒక నిదర్శనమని, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

సాకే భారతికి రెండు ఎకరాల భూమి.. జూనియర్ లెక్చరర్ పోస్ట్

"సాకే భారతి ఎన్నో కష్టాలు పడి, ఆమె అనుకున్న లక్ష్యాలను పూర్తి చేశారు. కెమిస్ట్రీలో డాక్టరేట్ పొందారు. ఇది ఎంతో గర్వకారణం. కాబట్టి దానిని మనం గుర్తించి.. ఆమెకు సహాయ సహకారాలు అందిస్తాం. ఆమెకు ప్రభుత్వం తరఫున రెండు ఎకరాల అసైన్డ్ భూమిని ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆమె ఇంటిని కూడా పూర్తి చేసి ఇస్తాం. ఆమె ఒప్పుకుంటే జూనియర్ లెక్చరర్ పోస్ట్ కూడా ఆఫర్ చేయడం జరిగింది". - గౌతమి, కలెక్టర్

Last Updated : Aug 1, 2023, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details