అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణంలో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. ఘటనలో రూ. 18 లక్షల నగదు, రెండు బంగారు ఉంగరాలను దుండగులు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కరూర్ వైశ్య బ్యాంక్‌పైన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న లక్ష్మీపతి అద్దెకు ఉంటున్నారు.
ఉదయం యథావిధిగా పాఠశాలకు వెళ్లిన లక్ష్మీపతి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. హడావుడిగా ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలోని రూ.18 లక్షల నగదు, రెండు బంగారు ఉంగరాలు కనిపించలేదు. గత మూడు నెలలుగా విద్యార్థులు చెల్లించిన పాఠశాల ఫీజులను బీరువాలో దాచానని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.