బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగాలతో.. శనివారం తెల్లవారుజామున ఐదింటికి జూబ్లీహిల్స్‌లోని ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో.. ఆయనతోపాటు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో వారంతా అనంతపురం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు.
కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగాలపై అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు తాజాగా కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, నలుగురు సిబ్బంది హైదరాబాద్‌లో వీరిని అరెస్టు చేశారు.
సాయంత్రం జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. ఇద్దరికీ 14 రోజులు రిమాండు విధించి రెడ్డిపల్లిలోని జిల్లా జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. అయితే రెడ్డిపల్లి జైలులో ఓ ఖైదీకి కరోనా అనుమానిత లక్షణాలు వెలుగు చూడటంతో వారిద్దరికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా తాడిపత్రి జైలుకు తరలించాలని సూచించారు. అయితే అక్కడికి తీసుకెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో అర్ధరాత్రి తర్వాత వారిద్దరినీ కడప జైలుకు తరలించారు.
- ఖైదీ నంబర్లు కేటాయింపు
కడప సెంట్రల్ జైలులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి రిమాండ్ ఖైదీ నంబర్లు కేటాయించారు. ప్రభాకర్ రెడ్డికి ఆర్పీ 2707, అస్మిత్ రెడ్డికి ఆర్పీ 2708 నంబర్లు కేటాయించారు.
ఇదీ చదవండి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు