అనంతపురం జిల్లాలో ఇద్దరు మహిళలకు ఒకే ఆధార్ నెంబర్ ఇచ్చిన పదేళ్ల సమస్య ఈనాడు - ఈటీవీ భారత్ చొరవతో పరిష్కారం అయింది. జిల్లాలోని చెన్నెకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామంలో సుబ్బమ్మ, జయమ్మలు తల్లీ కుమార్తెలు. 2011లో గ్రామంలోనే కనుపాపలు, వేలిముద్రలు తీసుకొని ఆధార్ కార్డులు పంపించారు. అయితే ఇద్దరి ఆధార్ కార్డుల్లో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ.. ఇద్దరికీ ఒకే ఆధార్ సంఖ్యను కేటాయించారు. అప్పటి నుంచి మొదలైన సమస్య పదేళ్ల పోరాటం చేసినా వేర్వేరు ఆధార్ కార్డులు రాలేదు. వారు వెళ్లని కార్యాలయం లేదు, కలవని అధికారి లేరనే చెప్పాలి. ఒకే ఆధార్ సంఖ్య కారణంగా ఉపాధిహామీ పనికి కూడా అర్హత కోల్పోయి, జాబ్ కార్డు పొందలేకపోయారు.
ఆ నిరుపేద మహిళల్లో తల్లి సుబ్బమ్మకు మాత్రం బియ్యం, పింఛను అందుతుండగా... అదే ఆధార్ సంఖ్య ఉన్న జయమ్మకు రేషన్ బియ్యం మొదలు ఏ పథకం అందలేదు. దీనిపై ఈనాడు - ఈటీవీ భారత్ కథనం ప్రసారం చేయటంతో అదే గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనాథరెడ్డి వారికి అండగా నిలిచారు. కథనానికి సంబంధించిన వీడియోను, ఈనాడు పత్రిక క్లిప్పింగును యూఐడీఏఐ అధికారులకు మెయిల్ చేశారు. వెంటనే.. దిల్లీ నుంచి అమరావతి వరకు అధికారులంతా స్పందించారు. నిరుపేదలైన సుబ్బమ్మ, జయమ్మల ఇంటి వద్దకే ప్రింటర్లు, ఇతర పరికరాలు తీసుకెళ్లి కనుపాపలు, వేలిముద్రలు తీసుకొని ఇద్దరికీ వేర్వేరుగా ఆధార్ కార్డులు వేర్వేరు సంఖ్యలతో మంజూరు చేశారు. పదేళ్ల సమస్యకు పరిష్కారం చూపిన ఈనాడు - ఈటీవీ భారత్కు తల్లీ కుమార్తెలు ధన్యవాదాలు చెప్పారు.