ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓబుళాపురం'లో 1.74 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం!

ఏపీ-కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌ మండలంలోని ఓబుళాపురం, మలపనగుడి, హెచ్‌.సిద్ధాపురం గ్రామాల పరిధిలో 1.74 కోట్ల టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉంటాయని గనులశాఖ ప్రాథమిక అంచనా వేస్తోంది.

1.74 crore tonnes of iron ore in Obulapuram
'ఓబుళాపురం'లో 1.74 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం!

By

Published : Dec 26, 2020, 7:04 AM IST

ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌ మండలంలోని ఓబుళాపురం, మలపనగుడి, హెచ్‌.సిద్ధాపురం గ్రామాల పరిధిలో 1.74 కోట్ల టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉంటాయని గనులశాఖ ప్రాథమిక అంచనా వేస్తోంది. అక్కడున్న లీజు ప్రాంతాల్లోనే కాకుండా, అటవీ ప్రాంతంలో కూడా ఈ నిక్షేపాలు ఉన్నట్లు భావిస్తోంది. దీనిపై కచ్చితమైన అంచనాల కోసం జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ద్వారా సమగ్ర అన్వేషణ చేయించనుంది. ఇక్కడ 54 చదరపు కి.మీ.ల రక్షిత అటవీ ప్రాంతం ఉంది. ఇందులో పలు చోట్ల ఖనిజం ఉంటుందని అంచనా. ఇనుప ఖనిజం వంటి మేజర్‌ మినరల్స్‌ లీజులను కేంద్రం వేలం ద్వారానే కేటాయిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు నేరుగా ఇచ్చేందుకు కూడా మొగ్గు చూపుతోంది. ఇప్పటికే 1,327 హెక్టార్లను కేంద్రం.. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి రిజర్వ్‌ చేసింది. మరో 2,700 హెక్టార్లను సైతం తమకు రిజర్వ్‌ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది.

ఆ మూడు లీజులు కావాలని..

ఓబుళాపురం ప్రాంతంలో ఆరు ఇనుప ఖనిజ లీజులు ఉండగా.. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ), అనంతపురం మైనింగ్‌ కంపెనీ(ఏఎంసీ)లకు చెందిన లీజుల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరుగుతోంది. మూడు లీజుల గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. ఈ లీజును సైతం ఏపీఎండీసీకి కేటాయించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా గనులశాఖ అధికారులు ఆయా లీజుల సరిహద్దులు కచ్చితంగా గుర్తించే ప్రక్రియను ఇటీవల చేపట్టారు. మరోవైపు విభజన చట్టం ప్రకారం జీఎస్‌ఐ ద్వారా ఖనిజ అన్వేషణ జరిపి, ఎంత మేరకు నిల్వలు ఉన్నాయనేది చెప్పాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని గనులశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే ఎక్కడెక్కడ తవ్వకాలు చేసేందుకు వీలుంటుందనే వివరాలను గనులశాఖ సిద్ధం చేస్తోంది. సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఏపీ-కర్ణాటక సరిహద్దు నిర్ధారణ పూర్తయ్యాక, ఇనుప ఖనిజ లీజుల కేటాయింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

తాడిపత్రి ఘటనలో పోలీసుల తీరుపై నేతల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details