తనకు మంత్రి పదవి రాకుండా పార్టీ అధిష్ఠానమే దెబ్బకొట్టిందని, అవకాశం వచ్చినప్పుడు తానూ దెబ్బకొట్టి తీరతానని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోటవురట్ల మండలంలో సోమవారం వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల అమరావతిలో చేసిన ‘హింసావాది’ వ్యాఖ్యలను ఓ విలేకరి ప్రస్తావించగా.. తన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
మంత్రి పదవి రాలేదు.. నా హింసావాదమేంటో చూపిస్తా : వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మంత్రి పదవి దక్కకపోవటంపై పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను అమాయకుణ్ణి కాదని.., తన హింసావాదం ఏమిటో తర్వలోనే చూపిస్తానని హెచ్చరించారు.
‘ఈ బోడి రాజకీయాలు నాకెందుకు? ఒక మాట కోసం వాళ్లతో వెళ్లాను. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చనిపోయాక బలమైన జాతీయ కాంగ్రెస్ పార్టీని వీడి హింసావాదంతో వైకాపాలోకి వెళ్లాను. ఆ రోజు ఎందరు ఏవేవో అన్నా లెక్క చేయకుండా ఈ పార్టీకి వచ్చి ఇన్ని త్యాగాలు చేస్తే.. నన్ను అమాయకుడిగా భావించి అధిష్ఠానం పదవి ఇవ్వకుండా చేసింది. నాపై ఆశలు పెట్టుకున్న లక్షలాది మందికి నేనేం చెప్పాలి. వాళ్లు (అధిష్ఠానం) అనుకుంటున్నారేమో అమాయకుడిని అని. నేను హింసావాదిని. నూటికి లక్ష పర్సంటేజ్ హింసావాదిని. చెప్పమంటే లక్ష మంది పబ్లిక్ మీటింగ్‌లో కూడా చెబుతా. ఏ భయమూ లేదు. కావాలంటే జైలులో పెట్టుకొమ్మనండి. ఒకరిని చంపారనుకోండి. తిరిగి ఇంకొకరిని చంపాల.. లేకపోతే ఎక్కడుందయ్యా న్యాయం’ అంటూ బాబూరావు వ్యాఖ్యానించారు. మీకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారా అని అడగ్గా.. ‘ఆయన పిలిస్తే వెళ్తా. పిలవకుండా ఎందుకు వెళ్తాను? కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆ విషయం సీఎంకు తెలియాలి. ఇక్కడి నుంచి 70 కార్లలో 250 మంది నాయకులతో వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాం. ఆయనేం స్పందించలేదు. అలాంటప్పుడు మేమేం చేస్తాం? వాళ్లు నన్ను దెబ్బకొట్టారు.. నేనూ దెబ్బకొట్టి చూపిస్తా’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులు..