YSRCP Government Careless on Town Development : తాగునీటి పథకమే పూర్తి చేసుంటే మహిళలకు ఆవేదన తప్పేది. గుంటూరులోని గోరంట్ల కొండపై ఉన్న కుటుంబాలకు తాగునీరు అందించేందుకు తక్కెళ్లపాడు తాగునీటి శుద్ధిప్లాంట్ నుంచి కొండపైకి పైపులైన్లు వేసి రిజర్వాయిర్‌కు అనుసంధానించాల్సి ఉంది. దీని ద్వారా అన్నపూర్ణనగర్, రెడ్డిపాలెం తదితర ప్రాంతాల ప్రజలకు నీటి కష్టాలు తీరతాయి. బ్యాలెన్సింగ్, సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తైనా గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకుసాగడం లేదు.
No Town Development in AP :అనకాపల్లికి శుద్ధజలాలు అందించేందుకు 2019లో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 32 కోట్ల రూపాయల అంచనాతో మొదలైన ఈపనులు నాలుగున్నరేళ్లు గడిచినా పూర్తి కాలేదు. 17 కిలో మీటర్లమేర పైపులైన్లు వేయాల్సి ఉంటే కేవలం 9 కిలో మీటర్ల పనులే పూర్తయ్యాయి. అనకాపల్లి పట్టణ ప్రజలకు ఈ పైపులైన్లలో వచ్చే శుద్ధజలాలు తాగే భాగ్యం ఇంకెన్నేళ్లకో.
పార్వతీపురంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన ప్రాజెక్టుదుస్థితి ఇది. 63కోట్ల 37లక్ష రూపాయల అంచనాతో ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు. నాగావళి నదిలో ఇన్‌ఫిల్ట్రేషన్ బావులు, బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్ నిర్మాణంతో పాటు 36 కిలో మీటర్ల పొడవునా పైపులైన్ల పనులు చేయాలి. అందులో 23 కిలో మీటర్ల మేర పైపులైన్లు వేశారు. గుత్తేదారు సంస్థకు 30 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టడంతో పనులు ఆపేశారు. నీళ్లేమోగానీ సగం తవ్వేసిన రోడ్లతో జనం తంటాలు పడుతున్నారు.
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఎర్రన్నాయుడు పార్కు - నాడు కళకళ, నేడు వెలవెల
ఆదోనిలోని మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ గడువు ప్రకారం ఈ ప్లాంట్ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ కనీసం20 శాతం పనులూ పూర్తి కాలేదు. ఎటుచూసినా ఇనుపచువ్వలే కనిపిస్తున్నాయి. ఇదే కాదు కర్నూలు, నంద్యాల మురుగునీరు శుద్ధి ప్లాంట్ల పనులూ నత్తనడకనే సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సరిగా విడుదల చేస్తే పనులు జోరుగా సాగేవి! పట్టణాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధ లేకపోవడంతో ఇవి ఇలా అసంపూర్ణంగా వెక్కిరిస్తున్నాయి.