MLA Golla Baburao On His statement: మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై, పార్టీ అధిష్ఠానంపైనా ఎలాంటి అసంతృప్తి లేదని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం కొరుప్రోలులో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అధిష్ఠానాన్ని దెబ్బకు దెబ్బ తీస్తానన్న సోమవారం నాటి మాటలకు విరుద్ధంగా స్పందించారు. ‘2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాయకరావుపేట నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచాను. వైఎస్సార్ మరణంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్‌తో నడిచా. పార్టీలో నిబద్ధతతో పనిచేస్తున్నా. 2019 ఎన్నికల్లో కొందరు నాయకులు టికెట్ ఇవ్వొద్దని చెప్పినా, నాపై నమ్మకంతో జగన్ బీఫారం ఇచ్చారు. భారీ మెజార్టీతో గెలిచా. మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం వెనుక కారణాలను అర్థం చేసుకోగలను. వైకాపా జిల్లా నాయకత్వం, మాజీ మంత్రులు నా నియోజకవర్గంపై చిన్నచూపు చూస్తున్నారు. 70 ఏళ్లుగా పాయకరావుపేటకు మంత్రి పదవి దక్కకపోవడంపై శ్రేణుల్లో బాధ ఉంద’ని బాబూరావు చెప్పారు.
MLA Golla Baburao : నేను ఎప్పటికీ వైఎస్‌ఆర్, జగన్‌కు వీరవిధేయుడినే -గొల్ల బాబూరావు - MLA Golla Baburao On Ministry
MLA Golla Baburao On Ministry: మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అధిష్ఠానంపై ఆదివారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
హింసావాదానికి నిర్వచనం
కోటవురట్లలో బాబూరావు మాట్లాడుతూ ‘లక్ష పర్సంట్ హింసావాదినే’ అన్న మాటలపై ప్రశ్నించగా, ‘హింసావాదం అంటే నా దృష్టిలో ధర్మాన్ని కోల్పోయినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఎదురుతిరగడం. నేను హింసావాదిని కాదు. నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయంపై ఎక్కడైనా నోరు జారి ఉంటానే తప్ప, ఆ మాటలు మనసులోంచి వచ్చినవి కాదు. కోటవురట్లలో నేను మాట్లాడిన మాటలను వక్రీకరించార’ని పేర్కొన్నారు. వాస్తవానికి ‘లక్ష మంది పబ్లిక్ మీటింగ్‌లోనైనా నేను హింసావాదినేనని చెబుతాను. కావాలంటే జైలులో పెట్టుకొమ్మనండి’ బాబూరావు వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి రాకుండా దెబ్బకొట్టిన అధిష్ఠానాన్ని సమయం వచ్చినప్పుడు తాను కూడా దెబ్బ కొడతానని, ఈ బోడి రాజకీయాలు నాకెందుకు? అని సోమవారం ప్రకటించిన బాబూరావు.. మరునాటికల్లా గొంతు సవరించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు విధేయుడిగా ఉంటానని, తానెప్పుడూ అధిష్ఠానానికి వ్యతిరేకం కాదని చెప్పారు.
ఇదీ చదవండి :'ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎందుకు అడ్డుకోలేదు'