Visakha Dairy Chairman Died: విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు(85) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి చెందిన తులసీరావు 30 ఏళ్లుగా విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు భార్య కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కుమార్తె పిళ్లా రమాకుమారి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్. కుమారుడు ఆనంద్‌కుమార్ విశాఖ డెయిరీ వైస్ ఛైర్మన్‌గా, విశాఖ నగర పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. గురువారం ఎలమంచిలిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
1939లో జన్మించిన తులసీరావు ఎలమంచిలి సర్పంచిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, విశాఖ డెయిరీ ఛైర్మన్‌గా పనిచేశారు. నష్టాల్లో ఉన్న విశాఖ డెయిరీని లాభాల బాట పట్టించారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పాడి రైతులకు అండగా నిలిచారు. పాడిరైతులకు అనే సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రైతులకు కార్పొరేట్ వైద్యం అందించడానికి విశాఖలో కృషి ఐకాన్ ఆసుపత్రిని నెలకొల్పారు.