Vangalapudi Anita complained to Anakapally SP : పోలీస్ స్టేషన్లు కన్సల్టెన్సీ సెంట్రల్గా మారాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆరోపించారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే దీని కోర్టులో పరిష్కరించుకోవాలని తనకు ఎస్హెచ్ ఎక్నాలజిమెంట్ ఇచ్చారని దీనిపై అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిశాలికి ఆమె శుక్రవారం ఫిర్యాదు చేసారు. మాజీ మహిళా ఎమ్మెల్యేపైనే సోషల్‌మీడియా వేదికగా అసత్య ప్రచారం జరుగుతుంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని అనిత ప్రశ్నించారు.
తాను అనలేని మాటలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తనకు షోకాస్ నోటీసు ఇచ్చారని ఫేక్ నోటీసుతో ప్రచారం చేశారని, సోషల్ మీడియాతో పాటుగా సాక్షి టీవీలోనూ దీనిపై ప్రచారం చేశారని అనిత తెలిపారు. దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే న్యాయస్థానంలో తేల్చుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి , ప్రభుత్వంపై ఎవరైనా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్న పోలీసులు, ఈ విషయంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలనడం విడ్డూరంగా ఉందన్నారు.
అధికార పార్టీకి ఒక న్యాయం ప్రతి పక్షాలకు మరో న్యాయమా? :అమరావతి విషయములో ఒక మహిళ సోషల్ మీడియాలో మాట్లాడితే సీఐడీ పోలీసులు ఆమెపై వెంటేనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డీజీపీకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు న్యాయస్థానంలో తేల్చుకోవాలని సమాధానం ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ఒక న్యాయం ప్రతి పక్షాలకు మరో న్యాయం అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు తాను న్యాయ పోరాటం చేస్తానని వంగలపూడి అనిత పేర్కొన్నారు
అసలేం జరిగింది :అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున యువగళం పాదయాత్రలో తన ప్రసంగాన్ని వక్రీకరించిన వారికి తగిన బుద్ధి చెబుతానని, నిజాలు తెలుసుకోకుండా సాక్షి టీవీలో వీడియో ప్రసారం చేసినందుకు ఫిర్యాదు చేస్తానని వంగలపూడి అనిత చెప్పారు. గురువారం మధ్యాహ్నం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ సీఎం అవుతారనే మాటను అననన్నారు. ప్రదీప్ అనే వ్యక్తి తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో వీడియో పెట్టినట్లుగా తెలిసిందని, అతని వెనుక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తనకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఫోర్జరీ సంతకంతో ఓ నకిలీ లేఖను విడుదల చేశారని ఆమె తెలిపారు.