ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tribals Protest: రేషన్ బియ్యం కోసం గిరిజనుల వినూత్న నిరసన - కంచాలతో నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజనులు

Tribals Protest For Ration: ఆ ఏడు గ్రామాల గిరిజనులది రెక్కాడితేనే గాని డొక్కాడని పరిస్థితి. ప్రతి నెల రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తుంటారు. కానీ గత మూడు నెలల నుంచి వారికి ఆ ఎదురు చూపులే మిగిలాయి. రేషన్ మాత్రం అందడం లేదు. అధికారులు మాత్రం ఒక నెల బియ్యం మాత్రమే ఇవ్వాలని అంటున్నారు. బియ్యాన్ని వెంటనే సరఫరా చేసి తమ కడుపు నింపాలంటూ గిరిజనులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Tribal Protest For Ration
రేషన్ బియ్యం కోసం గిరిజనుల వినూత్న నిరసన

By

Published : Apr 21, 2023, 5:23 PM IST

Updated : Apr 21, 2023, 7:17 PM IST

రేషన్ బియ్యం కోసం గిరిజనుల వినూత్న నిరసన

Tribals Protest For Ration : ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతదేశంలో కూడు, గుడ్డు కోసం ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్న గ్రామాలు ఇంకా ఉన్నాయి. రెక్కాడితేనే గాని డొక్కాడని పరిస్థితి ఆ ఏడు గ్రామాల గిరిజనులది. గత మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి అందాల్సిన రేషన్ బియ్యం అందక అవస్థలు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. తమ గోడు వారికి వినిపించడం లేదని, ఎమ్మార్వో, సివిల్ సప్లై ఆఫీసర్లు ఉన్నతాధికారులకు తప్పుడు లెక్కలు చూపుతున్నారని గిరిజనులు ఆరోపించారు. ఆహారం కోసం ఇంట్లో పెంచుకునే జంతువులను అమ్మి, వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దీన పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలిసే విధంగా వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

మూడు నెలలు నుంచి కోటా బియ్యం, ఇతర సరుకులు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని గిరిజనులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నోటితో ఆకులు నములుతూ, మరో చేత్తో కంచాలు పట్టుకొని భిక్షాటన చేస్తూ వారి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. రావికమతం మండలంలోని రొచ్చు పనుకు, కడగెడ, నేరేడు బంద తదితర గ్రామాల్లోని గిరిజనులకు ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు నిత్యావసర సరుకులు సరఫరా చేయకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తాము గతంలో చేసిన ఫిర్యాదుపై కొద్ది రోజుల క్రితం రెవెన్యూ అధికారులు వచ్చి.. కేవలం ఒక్క నెల సరకులే ఇవ్వాలని చెప్పి వెళ్లి పోయారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా సరుకులు అధికారులు తినేసి ఉంటారని గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకులు గోవింద రావు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకులు గోవింద రావు మాట్లాడుతూ.. రావికమతం మండలంలోని రేషన్ డిపో నెంబర్ 24 లో గత మూడు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ నుండి ప్రధానమంత్రి గరీబ్‌ యోజన బియ్యం కూడా ఇవ్వటం లేదని, గతంలో డిసెంబర్, జనవరి జోక్యం చేసుకోవాలని ఎమ్ఆర్ఓకి ఫిర్యాదు చేశామని, 3 నెలల బియ్యం రాలేదంటే కేవలం ఒక నెల మాత్రమే ఇవ్వలేదని రిపోర్ట్ ఇచ్చారని, మిగిలిన రెండు నెలల బియ్యం ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని పంపీణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో రేషన్ బియ్యం సరఫరా చేయకపోతే జిల్లా కలెక్టర్ ముందు ఇదే రీతిలో ఆందోళనలు చేస్తామని గోవింద రావు హెచ్చరించారు.

" రేషన్ బియ్యం ఇవ్వటం లేదు. మేము అడిగితే ఇస్తామని అంటున్నారు. మేము ఏమి తిని బతకాలి. మాకు వెంటనే బియ్యం సరఫరా చెయ్యాలి" -గంగరాజు, స్థానిక గిరిజనుడు

"మార్చి, ఏప్రిల్ నెల బియాన్ని వెంటనే ఇవ్వాలి. ఎమ్ఆర్ఓ, డీడీ, ఆర్ఐ వచ్చి చూశారు. రిపోర్ట్​లో ఒక నెల బియ్యం ఇవ్వలేదని రాశారు. 2 నెలల బియ్యం ఎవరు ఇస్తారు? అందుకే బియ్యం ఇవ్వాలని కంచాలతో నిరసన చేస్తున్నాం. ఈ నెలలో బియ్యం సరఫరా చేయకపోతే జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఇదే రీతిలో ఆందోళన చేస్తాం. " - గోవింద రావు, సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకులు

ఇవీ చదవండి

Last Updated : Apr 21, 2023, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details