Anakapalli DSP Transfer: గంజాయి నిందితుడు కారులో ప్రయాణిస్తూ నెంబర్ బోర్డు మార్చిన సంఘటనపై అనకాపల్లి డీఎస్పీ సునీల్‌ని బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీ సునీల్‌ని మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇతని స్థానంలో అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మల్ల మహేశ్వరరావుకి అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు.
అసలు ఏం జరిగిందంటే:కసింకోట జాతీయ రహదారి ఎన్జి పాలెం వద్ద గత ఏడాది జూలైలో గంజాయితో పట్టుపడ్డ స్కార్పియో వాహనాన్ని వదిలేసి నిందితులు పారిపోయారు. అందులోని గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాగా ఆ నెంబర్ బోర్డుని ఇదే కేసులో నిందితుడైన వ్యక్తికి చెందిన మరో కారుకి తగిలించడమే కాకుండా.. ఆ కారులో అనకాపల్లి డీఎస్పీ సునీల్ ప్రయాణించారు. ఒకానొక సమయంలో కారును నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ.. ముందున్న వాహనాన్ని డీ కొట్టడంతో.. సదరు వ్యక్తి డీఎస్పీ ప్రయాణిస్తున్న ఆ కారు వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అవి కాస్తా వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీపై చర్యలు తీసుకున్నారు. దీంతో పాటుగా అనకాపల్లి డీఎస్పి సునీల్.. పలు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతూ బాధితులను బెదిరించారని పలువురు ఫిర్యాదు చేయడంతో దీనిపైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు.