రహదారి విస్తరణ నేపథ్యంలో వర్తకుల ర్యాలీలు రహదారి విస్తరణ చేపట్టి తమ పొట్ట కొట్టొద్దంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని వ్యాపారులు రోడ్డు ఎక్కారు. వంద అడుగులు కాకుండా 67 అడుగుల మాత్రమే విస్తరించాలని స్వచ్ఛందంగా షాపులు మూసి వేసి ర్యాలీలు నిర్వహించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి నుంచి అబీద్ సెంటర్ వరకు విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇటీవల ప్రాథమికంగా పనులకు శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు పట్టణంలోని పురపాలక శాఖ అధికారులు సర్వే నిర్వహించి షాపులకు మార్కింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన తర్వాత ప్రక్రియ.. రోడ్డు విస్తరణ పనులు చేపడితే వందలాది మంది రోడ్డున పడతారని వ్యాపారులంతా ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగానే ఈ నెల 13వ తేదీన వ్యాపారులంతా ప్రత్యేకంగా సమావేశమై 14న పట్టణంలోని స్వచ్ఛందంగా బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వర్తకులంతా మంగళవారం స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ర్యాలీలు నిర్వహించారు.
స్థానిక వాసవి కళ్యాణ మండపం వద్ద ర్యాలీ ప్రారంభించి అబిద్ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీ కన్య కూడలి మీదుగా పెద్ద బొడ్డేపల్లి వరకు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయానికి, పురపాలక సంఘ కార్యాలయానికి వినతి పత్రాలను అందజేశారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు తాము ఆటంకం కాదని, అయితే ఈ విషయంలో తమ వినతులను కూడా పరిశీలించి తమకు న్యాయం చేయాలని వర్తకులు కోరుతున్నారు.
"ఒకప్పుడు పంచాయతీగా ఉన్న నర్సీపట్నం ఇప్పడు మున్సిపాలిటీగా మారే క్రమంలో మా పాత్ర కూడా ఉంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా 15 రోజుల్లో స్థలాలను ఖాళీ చేయంటం, టీడీఆర్ వంటి మా సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలించి మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్విహిస్తున్నాము." - రాయుడు, వర్తకుడు
"మా మనసులో ఉన్న బాధలను, మా సమస్యలను ప్రభుత్వానికి తీసుకుని వచ్చేందుకే మేము ఇలా ర్యాలీలు నిర్వహిస్తున్నాము. అంతేకానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఒక్కసారిగా రోడ్డు విస్తరణ 100 అడుగుల మేరకు చేపడితే మా అందరి భవనాలు, షాప్‌లను కోల్పోయి జీవనోపాధిని కోల్పోతాము. అందువల్ల ఈ రోడ్డు విస్తరణను 60 అడుగులకు తగ్గించాలని, మార్కెట్ విలువను దృష్టిలో పెట్టుకుని టీడీఆర్ రూపంలో ఇచ్చిన నగదును కూడా పెంచాలని కోరుకుంటూ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందించాము. అంతే తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలను నిర్వహించలేదు." - శ్యామ్, వర్తకుడు