Rowdy Sheeter Murder : అనకాపల్లి జిల్లాలో రూ.లక్ష బకాయి కోసం ఇద్దరు రౌడీషీటర్ల మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. అనకాపల్లి మండలం ఊడేరు సమీపంలోని పొలాల్లో జరిగిన రౌడీషీటర్ కన్నబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అనకాపల్లికి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ మురళీ కృష్ణ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కన్నబాబు(43) 2019 నుంచి అనకాపల్లిలోని గాంధీనగరంలో తల్లి రామయమ్మ, తమ్ముడు శివరామకృ ష్ణతో కలిసి ఉంటున్నాడు. కన్నబాబుపై విశాఖపట్నంలో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, దారి దోపిడీ కేసులు ఉన్నాయి. ఇతనిపై రౌడీషీట్ తెరిచారు. అనకాపల్లికి నివాసం మార్చాక విజయరామరాజు పేటకు చెందిన రౌడీషీటర్ చిన్ని లక్ష్మణరావు ఎలియాస్ లచ్చ (29), లోపింటి సురేంద్ర (37), గాంధీనగరానికి చెందిన పండూరి దుర్గారావు(29) లతో స్నేహం ఏర్ప డింది.
ఈ నేపథ్యంలో చోడవరానికి చెందిన ఓ మహిళకు చెందిన భూ సెటిల్మెంట్ వ్యవహా రంలో రాజాన కన్నబాబు తలదూర్చాడు. ఈ నెల 21న కన్నబాబు తన స్నేహితులైన ముగ్గురితో కలిసి చోడవరం వెళ్లారు. అక్కడ భూ వ్యవహారానికి సంబంధించి మాట్లాడారు. సాయంత్రం వరకు చోడవరంలో మద్యం తాగి తిరిగి రెండు బైకులపై అనకాపల్లి బయలుదేరారు. వెంకన్నపాలెం వద్ద మద్యం కొనుక్కుని ఊడేరు గ్రామంలోని పొలాల్లోకి వెళ్లి తాగారు. ఈ సమయంలో కన్నబాబు తనకు ఇవ్వాల్సిన రూ.లక్ష బకాయి కోసం లక్ష్మణరావు ఎలియాస్ లచ్చను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య తగాదా జరిగింది.